ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం నాడు ఒక పెద్ద ప్రహసనం నడిచింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదంటూ... అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. ఇంత కంటె పెద్ద ప్రహసనం సమీప భవిష్యత్తులో కనిపించదేమో అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అచ్చంగా.. సుమారు ఏడాదిన్నర కిందట.. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఏపీ (ఉమ్మడి) అసెంబ్లీ లో చేసిన తీర్మానం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. గతంలో ఆ తీర్మానానికి కేంద్రంలో ఏపాటి విలువ దక్కిందో.. ఇప్పుడు చేసిన తీర్మానానికి కూడా అంతకంటె ఎక్కువ మన్నన దక్కేదేమీ ఉండబోదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఇంతకూ రాష్ట్రానికిప్రత్యేకహోదా అనేది పోరాటం ద్వారా తీసుకోవడం ఏమాత్రం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా.. తీర్మానం చేసేసాం.. ఇక ఉద్యమం లేదు మూసుక్కూచోండి అని చెప్పినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా కోసం చేసిన తీర్మానంలో... చంద్రబాబునాయుడు ఇంకా బోలెడు అంశాలను కూడా చొప్పించి పెట్టారు. అందులో పన్ను రాయితీలు, రాజధాని నిర్మాణానికి నిధులు, 13 కేంద్రీయ సంస్థల స్థాపన, సెక్షన్‌ 8 అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అనే అంశాలను కూడా అందులో పెట్టారు. 


నిజానికి ఈ అంశాలన్నిటినీ ఈ తీర్మానంలో చొప్పించడం అనేది.. పెద్ద మాయలాగా కనిపిస్తున్నది. అసలు ప్రత్యేకహోదా అనే అంశం తప్ప.. మరొక్క పాయింటు లేకుండా ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించి ఉంటే హోదా కోసం మన కృతనిశ్చయానికి ఒక విలువ దక్కేది. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. దాన్ని మొత్తం పలుచన చేసేశారు. నాశనం చేశారని చెప్పాలి. రేప్పొద్దున ఈ తీర్మానం కాపీ.. కేంద్రానికి వెళ్లగానే.. కేంద్రీయ విద్యాసంస్థల ప్రకటన, పన్నురాయితీల అధ్యయనానికి కమిటీ వంటివి వస్తాయి. మా తీర్మానంతో మేం సాధించేశాం అని చంద్రబాబు సొంతడబ్బా కొట్టుకోవడం ప్రారంభిస్తారన్నమాట. నిజానికి పన్ను రాయితీలు, విద్యాసంస్థలు ఇస్తాం అంటూ కేంద్రలోని పెద్దలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. వారు ఖచ్చితంగా ఇస్తాం అని చెప్పిన వాటిని ఈ తీర్మానంలో పెట్టి.. చంద్రబాబు ఎవరిని మోసం చేయదలచుకున్నారో అర్థం కావడం లేదు. ఇకపోతే పోలవరానికి ఆయన నిధులు అడుగుతున్నారు. ఒకసారి దానికి జాతీయ హోదా వచ్చిన తర్వాత.. నిధులు ఇవ్వడం కేంద్రం బాధ్యత.. దానికోసం పోరాడాలి. దానికోసం ముష్టెత్తుతున్నట్లుగా ఉన్నది. ఇంకా ఆయన సెక్షన్‌ 8 అమలును కూడా ఈ తీర్మానంలో పెట్టేశారు. ఒకవైపు హైదరాబాదునుంచి రాజధాని తరలించుకు వెళ్లిపోతున్నాం అంటూనే.. ఇక్కడ తమ రాజకీయ దందాలకు హెచ్చరికగా మారిన కేసులనుంచి తప్పించుకోవడానికి ఆయన సెక్షన్‌ 8 అస్త్రాన్ని వాడుకుంటున్నారు. 


నిజానికి ఇవన్నీ కలపడం ద్వారా.. ఈ తీర్మానంలోని పాయింట్లలో ఏది ముఖ్యమో.. కేంద్రం తేల్చుకోలేని పరిస్థితిని సృష్టించినట్టే. ఫరెగ్జాంపుల్‌ తపస్సు చేసి... దేవుడు ప్రత్యక్షం కాగానే కోరికల చిట్టా ఆయన చేతిలో పెట్టి.. ''కాస్త చూడండి సారూ'' అని చెప్పినట్లుగా ఇది ఉన్నది. అలా కాకుండా.. నిర్దిష్టంగా ఒక కోరిక కోరితే.. దాన్ని భగవంతుడు వెంటనే తేల్చేయవచ్చు. అలాకాకుండా.. చిట్టా చేతిలో పెట్టి.. 'కాస్త చూడు' అంటే.. దాన్ని దేవుడు నిదానంగా చదువుకుని.. తనకు వీలైన కొన్నింటికి టిక్కు పెట్టి.. కొన్నింటికి తూచ్‌ అంటే.. అలా తూచ్‌ అనబడిన వాటిలో.. హోదా కూడా కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి? అదే ప్రజల్లో ఉన్న భయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: