ఎంత కాలం పరిపాలించారు.. ఎంత బాగా పరిపాలించారు.. జనంపై ఎంత బాగా ప్రభావం చూపగలిగారు.. చరిత్ర గతిని ఎంతగా మార్చారు.. ఓ నేత ప్రతిష్టను బేరీజు వేయడానికి ఇవి కొన్ని కొలమానాలు.. ఈ స్కేళ్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కొలిస్తే... మొదటి అంశంలో ఆయనకు తక్కువ మార్కులే పడతాయి.. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది కేవలం ఐదున్నర సంవత్సరాలే. ఓ రాష్ట్ర ప్రస్థానంలో ఇదే మంత ఎక్కువ కాలం కాదు. 

కానీ ఎంత బాగా పాలించారు... జనంపై ఎంత బాగా ప్రభావం చూపగలిగారు.. అనే కోణాల్లో వైఎస్ పరిపాలనను పరిశీలిస్తే ఆయనకు ఫస్ట్ క్లాస్ మార్కులు దాటిపోతాయి. ఎందుకంటే.. ఆయన ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నేతా ప్రవేశపెట్టలేదు. పేదవాడి సంక్షేమం గురించి ఆయన ఆలోచించినంతగా ఏ నేతా ఆలోచించలేదేమో.. ఈ పథకాల వెనుక ఓట్లు కొల్లగొట్టాలనే వ్యూహం ఉండొచ్చు.. కానీ అల్టిమేట్ గా జనం సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే కదా..అసలు విషయం.

ఓ బడుగు వ్యక్తికి పెద్ద రోగమొస్తే ఏం చేయాలి.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదవాడు చికిత్స చేయించుకోగలడా.. ఓ పదేళ్ల క్రితం వరకూ ఇది కలలోనైనా ఊహించని విషయం. కానీ దాన్ని వైఎస్ సుసాధ్యం చేసి చూపించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా.. సామాన్యుడు కూడా కార్పొరేట్ వైద్యం అందుకునే అవకాశం కల్పించారు. స్వయంగా వైద్యుడైన ముఖ్యమంత్రి తన ప్రజలకు ఇచ్చిన కానుక ఇది..

ఓ నిరుపేద విద్యార్థి ఇంజినీరింగ్ చదవగలడా.. పుస్తక పరిజ్ఞానం, ప్రతిభ అపారంగా ఉన్నా.. ఓ పేద విద్యార్థి వేలకు వేలు ఫీజులు కట్టి ఖరీదైన చదువులు చదవగలడా.. ఓ పదేళ్ల క్రితం వరకూ ఇది కూడా ఓ కలలో కూడా ఊహించని విషయం. కానీ వైఎస్ దీన్ని కూడా సుసాధ్యం చేశారు. ఆర్థిక పరమైన వెనుకబాటు తనంతో ఏ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం ప్రవేశ పెట్టారు. ఎందరో నిరుపేదలకు విద్యాదానం చేసి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 

ఈ రెండు పథకాలు చాలు.. వైఎస్ ఆలోచనా విధానానికి, పేదల పక్షపాతి అని చెప్పడానికి ఈ రెండు పథకాలు చాలు.. ఇవి కాకుండా 2 రూపాయలకే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. చాలా మంది ఈ పథకాలను బడ్జెట్ కు గుదిబండలని, అభివృద్ధి నిరోథకాలని విమర్శిస్తారు. మరి సర్కారు సొమ్ము జనం కోసం కాకపోతే.. ఇంకెందుకు.. వారి సంక్షేమం కోసం కాకుండా ప్రభుత్వానికి ఇతర ప్రాధాన్యాలేముంటాయి.. అంటే మాత్రం సమాధానం కనిపించదు. 

ఐతే.. వైఎస్ పాలనంతా స్వర్ణయుగమేనా.. వైఎస్ హయాంలో అరాచకాలు లేవా.. అంటే అవీ ఉన్నాయి.. జలయజ్ఞంపేరుతో సాగిన ధనయజ్ఞం, కాంట్రాక్టుల పేరుతో సాగిన అవినీతి రాజ్యం, అధికారం అడ్డుపెట్టుకుని అస్మదీయులకు సర్కారు సొమ్ము ధారపోసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై సాగించిన హత్యాకాండ.. ఇలాంటి మరకలెన్నో ఆయన పాలనలో ఉన్నాయి. వాటినీ విస్మరించలేం. 

వైఎస్ వ్యక్తిత్వం కూడా విచిత్రమైంది. ఆయన ఓ మాస్ లీడర్. తనను నమ్మినవారు ఎంతటి దుర్మార్గులైనా వెనకేసుకొస్తారు. అంతే.. తనను నమ్ముకున్న వారి కోసం ఎలాంటి పనికైనా వెనుకాడరు. అది ఆయన నైజం. రాజకీయంగా ఆయన పార్టీలను ఎదుర్కొన్న తీరుపైనా విమర్శలున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సమితిని నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆయన సాగించిన రాజకీయం ఆయన పట్టుదలను తెలియజేస్తుంది. ఆయనే ఇంకొన్నాళ్లు బతికుంటే.. ఆ పార్టీయే లేకుండా పోయేదన్నది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. 

వైఎస్ బతికుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యే అవకాశమే ఉండేది కాదు.. ఇది చాలామంది తెలంగాణవాదులు కూడా అంగీకరించే వాస్తవం. ఆయన మరణం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతినే మార్చివేసింది. ఆయన హఠాన్మరణంతో టీఆర్ఎస్ లో పునరుజ్జీవనం కనిపించింది. కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టి..వైఎస్ మరణించిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించగలిగారు. ఒక్క నాయకుడు లేకపోతే.. చరిత్ర ఇంతగా ప్రభావితమవుతుందా.. జనం జీవితాల్లో ఇన్ని మార్పులొస్తాయా.. ఈ ప్రశ్నలకు వైఎస్సే ఓ సమాధానం. చరిత్రను అంతగా ప్రభావితం చేసే నాయకుడని జనం కూడా అంత త్వరగా మరచిపోలేరు. అందుకే వైఎస్ మరణించి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అందుకే వైఎస్ నాయకుడా.. ప్రతినాయకుడా.. అంటే జనం మరువని నాయకుడని మాత్రం చెప్పగలం.



మరింత సమాచారం తెలుసుకోండి: