భూసేకరణ ఆపకపోతే రాజధాని గ్రామాల్లో ధర్నాకు దిగుతా అన్న పవన్ హెచ్చరికతో ఆంధ్రా సర్కారు దిగివచ్చింది. భూసేకరణ ఆపేసినట్టు ప్రకటించేసింది. ఇదంతా పవన్ ఎఫెక్టేనని సాక్షాత్తూ టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. పవన్ చెప్పారు కాబట్టి చేస్తున్నామని సాక్షాత్తూ మంత్రి నారాయణే ప్రకటించేశారు. ఈ విషయంలో టీడీపీ సర్కారు తన నెత్తిన తానే మట్టిపోసుకున్నట్టైంది. 

ఓవైపు రాజధాని గ్రామాల్లో సర్కారువైఖరిపై పెరుగుతున్న అసంతృప్తి.. ఇంకోవైపు గుండెలపై కుంపటిలా పవన్ కల్యాణ్ గొడవ.. మరోవైపు గడువు ముంచుకొస్తున్న భూసేకరణ ఆర్డినెన్స్.. ఇలా అన్ని కారణాలు కలసి వచ్చాయి.. ఆంధ్రా సర్కారును వెనుకడుగు వేసేలా చేశాయి. సర్కారు నిర్ణయం వెనుక ఎలాంటి కారణాలున్నా.. సర్కారు నిర్ణయంతో మాత్రం కొన్ని రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని ప్రాంతంలోని దాదాపు  ఎనిమిది గ్రామాల రైతులు ఇప్పుడు వేడుక జరుపుకోబోతున్నారు. సెప్టెంబర్ మూడో తేదీన ఉత్సవం జరుపుకోవాలని నిర్ణయించేసుకున్నారు. 

ఇప్పుడు కేంద్రంలో భూసేకరణ బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదు. ఆ ఆర్డినెన్స్ ను కేంద్రం వెనక్కి తీసేసుకుంది. సో.. ఇప్పుడు రాజధాని కోసం భూమి సేకరించాలటే.. పాత ప్రక్రియ ద్వారా ముందుకెళ్లాలి.. అదంత ఈజీ కాదు.. ముందుగా నోటీసులు ఇవ్వాలి.. గ్రామ సభలు నిర్వహించాలి.. సంబంధింత ప్రాంతంలో దాదాపు 80 శాతం మంది భూసేకరణకు అంగీకరించాలి. ఇన్ని నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భూసేకరణకు వెళ్లే సాహసం సర్కారు చేయకపోవచ్చు. 

మరోవైపు రైతులను ఒప్పించే్ భూములు తీసుకుంటామని ఆంధ్రా సర్కారు చెబుతోంది. మరి ఇవ్వం మొర్రో అంటున్న రైతులను ఎలా ఒప్పిస్తారు.. వాళ్ల కోరికలు ఎలా తీరుస్తారు.. రాజధాని ప్రక్రియ ఎలా ముందుకు వెళ్తుంది. అన్నీ జవాబు లేని ప్రశ్నలే.. 



మరింత సమాచారం తెలుసుకోండి: