వైఎస్ ఫోటో వివాదం ఆంధ్రాలో ఆసక్తికరమైన రాజకీయ సమరానికి దారి తీస్తోంది. గత అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని.. అసెంబ్లీ లాంజ్ లోని వైఎస్ ఫోటోను ఇటీవల తీసేశారు. దాన్ని మళ్లీ యథాప్రకారం ఉంచాలని వైసీపీ పోరాడుతోంది. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇష్యూ చేసి టీడీపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నించింది. 

అసెంబ్లీ సమావేశాల మూడోరోజు... ఇదే అంశంపై ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ దశలో సభ  వాయిదా పడింది. వాయిదా సమయంలో శాసససభ లాంజ్‌లో వైఎస్‌ చిత్రపటం ఉంచి వైకాపా సభ్యులు నివాళులు అర్పించారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్ చిత్రపటాలను లాంజ్ లో అతికించారు. మరికొన్ని ఫోటోలను చేతబట్టుకుని మీడియా పాయింట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.


అయితే అసెంబ్లీ లాబీల్లో వైసీపీ నేతలు అలా ప్రవర్తించడం సభాహక్కుల ఉల్లంఘన కింద వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగా.. వైసీపీ ఎమ్మెల్యేలపై సభాపతి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అనుమతి లేకుండా వైస్ చిత్రాలు అంటించడంపై చర్యలు ఉంటాయని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు కూడా. ఇలా చర్యలు తీసుకోవడానికి ఎవరైనా సభ్యులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. 

అసెంబ్లీ పరిధిలో స్పీకర్ కు విశేషాధికారాలు ఉంటాయి. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ స్పీకర్ ను అనుచిత పదజాలం వాడారన్న కారణంతో వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నారు.. క్షమాపణ చెప్పించారు. ఇప్పుడీ అంశంలోనూ మరోసారి సభాపతి క్షమాపణ చెప్పించాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.  మొత్తం మీద వైసీపీ సభ్యులు అనాలోచిత దుందుడుకు చర్యలతో ఉన్న సానుభూతి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: