ఓటుకు నోటు కుంభకోణం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందా.. వైసీపీ - టీఆర్ఎస్ ఈ విషయంలో సంయుక్తంగా మాస్టర్ ప్లాన్ వేసుకున్నాయా.. ఆ మేరకు  జగన్, హరీశ్ రావు, స్టీఫెన్ సన్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో కలుసుకున్నారా.. ఇప్పుడీ అంశాలు అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి అచ్చెన్నాయుడితో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సభలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు కూడా ఆ మాట అన్నారంటే అందుకో ఎంతో కొంత నిజం ఉందని జనం ఎక్స్ పెక్ట్ చేస్తారు. 

ఇదే విషయాన్ని టీడీపీ సభలో ప్రస్తావించి ఇరుకున పెట్టాలని చూసింది. కానీ దీనిపై జగన్ చాలా సీరియస్ గానే స్పందించారు. దమ్ముంటే ఆధారాలు చూపించు.. రాజీనామా చేస్తా అనేశారు. అక్కడితో ఆగకుండా.. రుజువు చేయకపోతే...చంద్రబాబుతో రాజీనామా చేయిస్తావా అని సవాల్ విసిరారు. విషయం అంతదాకా వచ్చాక ఆధారాలుంటే ఎవరైనా చూపించేస్తారు.. కానీ టీడీపీ నేతలు ఆ పని చేయలేదు. 

ఈ ఇష్యూలో టీడీపీ వెనక్కు తగ్గడం చూస్తే హరీశ్ - జగన్ భేటీకి ఆధారాలు లేవనే అర్థమవుతోంది. అయితే అంత సులభంగా ఓటమి అంగీకరించడం టీడీపీ నేతలకు రుచించడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త రాగం అందుకుంటున్నారు. సాక్ష్యాలు చూపించమని జగన్ సవాల్ విసిరినా.. ఎందుకు చూపించలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు యనమల స్పందించారు. పాము పుట్టలోనుంచి అస్తమానం రాదని... సందర్భం వచ్చినపుడే బయటికి వస్తుందని.. ఈ సాక్ష్యాలు కూడా అంతేనని యనమల సెటైర్ వేసారు. 

మరో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ అసెంబ్లీలో తాను మే21 అనే తేదీ చెప్పేసరికి.. జగన్ టీఆర్ఎస్ నేతల భేటీ అయిన హోటల్ లో హడావుడిగా సీసీటీవీ రికార్డులను తొలగించారని చెప్పారు. కావాలంటే ఎవరైనా ఇపుడు హోటల్ కు వెళ్లి రికార్డులు పరిశీలించవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. తాము చెప్పిన తేదీ రికార్డులు తొలగించడంలోనే వారి బండారం బయట పడుతోందన్నారు. ఐతే.. తాము గతంలోనే సీసీటీవి రికార్డులన్నీ సంపాదించి పెట్టుకున్నామని సరైన సమయంలో బయటికి వస్తాయని చెబుతున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలున్నాయని తాము మొదట చెబితే ఎవరూ నమ్మలేదని.. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వమే న్యాయస్థానంలో ఒప్పుకోవాల్సి వచ్చిందన్న సంగతిని ఏపీ మంత్రులు గుర్తు చేశారు. సాక్ష్యాలు కూడా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టే బయటికి వస్తాయని టీడీపీ మంత్రులు చెప్పారు. ఇంతకూ హరీశ్ -జగన్ భేటీ జరిగినట్టేనా.. ఆ ఫుటేజీ టీడీపీ నేతల దగ్గర ఉన్నట్టేనా.. ముందు ముందు కానీ ఏ విషయం తేలదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: