వైఎస్‌ జగన్మోహనరెడ్డి రాజకీయ అవినీతికి సంబంధించిన కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అంతమాత్రాన ఆయన ఏ సాధారణమైన అంశాన్ని ప్రస్తావించినా కూడా... తెలుగుదేశం పార్టీ మాత్రం.. ఆయన అవినీతిని గురించి మాత్రమే మాట్లాడుతూ.. ప్రతి సందర్భంలోనూ చర్చను పక్కదారి మళ్లించడానికే అత్యుత్సాహం చూపిస్తుంటుంది. జగన్‌ పార్టీ అడిగిన నిలదీసిన పాయింటు ఏమిటి? అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే తమాషా ఏంటంటే.. శుక్రవారం నాడు శాసనసభలో.. జగన్‌ పాల్పడిన అవినీతి మొత్తం గురించి తెదేపాకు చెందిన చీఫ్‌ విప్‌ చాలా తక్కువ మొత్తాన్ని కోట్‌ చేశారు. జగన్‌ ఎంత అవినీతి చేశారని, సొమ్ము స్వాహా చేశారని తెదేపా ఇన్నాళ్లుగా ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిందో.. అందులో 25 శాతం మొత్తం మాత్రమే.. ఆయన అవినీతి అన్నట్లుగా.. తెదేపా నేతలు వ్యాఖ్యానించడం విశేషం. 


జగన్‌ గానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గానీ.. ఏ అంశాన్ని గురించి ప్రశ్నించినా.. తెలుగుదేశం స్పందన మాత్రం ఆయన అవినీతికేసులు, కోర్టుకు హాజరు కావడాలూ అనే పాయింటు మీదికే మళ్లుతుంది. నిజానికి ఇది పలాయనవాదం పాటించడంలో చాలా చవకబారు టెక్నిక్‌ గా పరిగణించాలి. చిట్టచివరికి జగన్‌.. పుష్కరాల సమయంలో మరణాల గురించి ప్రశ్నించినా కూడా.. జగన్‌ లాగా అవినీతి కేసుల్లో తమ నాయకుడు లేడని నానా మాటలూ అంటూ ఉండడం కద్దు. ఇదంతా టీవీల్లో శాసనసభ సమావేశాలను గమనించే ప్రేక్షకులకు కంఠోపాఠంం అయిపోయింది. 


ఈ చర్చనంతా పక్కకు పెడితే.. ఇన్నాళ్లుగా జగన్‌ అవినీతిగురించి తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్న మొత్తం ఎంత? వైఎస జగన్‌ తన తండ్రి సీఎం గా ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. లక్ష కోట్ల రూపాయలను స్వాహా చేసేశారంటూ తెదేపా కొన్ని సంవత్సరాలుగా ఊదరగొడుతూనే ఉన్నది. తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఒక వ్యక్తి కాజేయడం అన్నది.. ఒక మామూలు విషయంగా అలవాటు అయిపోయే స్థాయికి.. తెదేపా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా తెదేపా ఆ మొత్తాన్ని తగ్గించేసింది. 
శుక్రవారం అసెంబ్లీలో ఓ అంశం మీద చర్చ సందర్భంగా తెదేపా చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. ఆయన తన మాటల్లో.. 26వేల కోట్ల అవినీతి కేసుల్లో ఉన్న జగన్‌ అంటూ స్పష్టంగా ప్రకటించారు. అంటే జగన్‌ అవినీతిని అచ్చంగా పావు వంతుకు తగ్గించేరశారన్నమాట. అంటే ఇన్నాళ్లూ తమ పార్టీ చెప్పిన లక్షకోట్లు అనేమాట అబద్ధం అని తెదేపా ఒప్పుకుంటున్నట్టేనా.. అని చూసిన వారు విస్తుపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: