వాళ్లు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు. విశేషాధికారాలు ఉన్న చట్టసభలో అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తలరాతల్ని నిర్దేశించే చట్టాలను వారు రూపొందిస్తుంటారు. అలాంటి చట్టాల గురించే చర్చిస్తుంటారు. ఆ చట్టాలను ఎలా చక్కదిద్దితే.. ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచన చేస్తుంటారు.. అందుకోసమే.. ఏడాదిలో అన్నిరోజులూ కాకపోయినా... కనీసం శాసనసభ సమవేశాలకు కొలువు దీరిన కొన్ని రోజుల్లో అయినా.. పనిచేస్తుంటారని మనం విశ్వసిస్తూ ఉంటాం. మనం నమ్ముతున్నది నిజమేనా... వాళ్లు అసెంబ్లీ సమావేశాల్లో నిత్యం మన కోసమే పనిచేస్తూన్నారా? ఈ ప్రశ్న పెద్ద కామెడీ. అయితే ఏదో ఒకటి అసెంబ్లీ ఉన్న రోజుల్లో వారు ఎంత మాత్రం పనిచేస్తున్నారో లెక్కచూసినా.. కడుపుమంట తప్ప మరోటి ఉండదు. 


ప్రస్తుతం.. అయిదురోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దారుణమైన విషయం ఏంటంటే.. ఈ అయిదురోజుల్లో సభ శాసనసభ పనిచేసింది.. కేవలం 20 గంటల 39 నిమిషాలు మాత్రమే. అంటే సగటున రోజుకు మన ఎమ్మెల్యేలు పనిచేసింది 5 గంటలు మాత్రమే అన్నమాట. ఇందుకు వీరు పుచ్చుకునే వేతనాలు, అలవెన్సులు లాంటివన్నీ లెక్కకట్టి తెలుసుకుంటే.. మనకు గుండెలు గుభిల్లుమంటాయి. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారంనాడు ముగిసాయి. అనగా, నిరవధికంగా వాయిదాపడ్డాయి. స్పీకరు ఆ ప్రకటన చేసిన సమయానికి అధికారికంగా వెల్లడైన గణాంకాల ప్రకారం.. చెప్పిన వివరాలు ఇవి. 


పనిచేసిందే తక్కువ సమయం అంటే.. ఆ తక్కువ సమయంలోనూ వారు ఏం పనిచేశారో.. ఎంత శుభ్రంగా చేశారో.. గమనించడం కూడా ముఖ్యం. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న సామెత చందంగా ఆ వివరాలన్నిటినీ నెమరు వేసుకుంటే మరికాస్త కడుపుమంట తప్ప మరో లాభం ఉండదు. మెజారిటీ సభా సమయాన్ని పాలక, ప్రతిపక్షపార్టీలూ రెండూ.. ఒకరినొకరు తిట్టిపోసుకోవడానికి మాత్రమే పరిమితం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. రకరకాల పాయింట్లు కారణాలుగాచూపిస్తూ.. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడానికి వైకాపా ప్రయత్నిస్తూ పోతే.. జగన్‌ అవినీతి పరుడు.. ఆయన ప్రతి శుక్రవారం విచారణకు కోర్టుకు వెళ్తుంటాడు.. అంటూ.. ఎంతసేపూ జగన్‌ మీది విమర్శలతోనే.. కాలం వెళ్లబుచ్చేయాలని తెలుగుదేశం ప్రయత్నించింది. ప్రభుత్వం అనుకున్న బిల్లులన్నీ.. మొక్కుబడి చర్చలతోనే ముగిసిపోయాయి. నిజానికి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద అర్థవంతమైన చర్చ అనేది జరగలేదని నిగ్గుతేలిస్తే.. అది మరింత ఆవేదన కలిగిస్తుంది. ఏంచేద్దాం?


మరింత సమాచారం తెలుసుకోండి: