వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన మీడియా గ్రూపు సాక్షి టీవీ.. తమ మీద నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులుపై పరువు నష్టం దావా వేయడానికి ఆలోచిస్తున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. మీడియా సంస్థను నిరాధార ఆరోపణలతో వారి రాజకీయ వివాదంలో భాగస్వామిగా చిత్రీకరించేందుకు.. ప్రయత్నించినందుకు గాను ఎమ్మెల్యేపై దావా వేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యలకు సంబంధించిన టేపులను న్యాయనిపుణులకు చూపించి, అందులో ఉన్న కంటెంట్‌ను బట్టి.. ఏ విధంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చునో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సాక్షి టీవీ యాజమాన్యం ఈ విషయంలో ఇలాగే ముందుకెళితే.. గనుక.. తెదేపా ఎమ్మెల్యేకు చిక్కులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. 


ఇంతకూ ఈ వివాదానికి మూలకారణం ఏంటంటే.. శుక్రవారం నాడే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఓటుకు నోటు వ్యవహారం రభస జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సభలో మాట్లాడుకున్నంత సేపు దీనిమీద ఇరు పార్టీలు నానా విమర్శలు చేసుకున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేరు 22 చార్జిషీట్‌లో ప్రస్తావిస్తే.. దానిపై సభలో చర్చ జరక్కపోతే ఎలా అని వైకాపా వాదిస్తే.. కేసీఆర్‌ రాత్రి పూట ఫోను చేయడం వల్లనే ఉదయం వైకాపా ఈ అంశం లేవనెత్తిందంటూ తెదేపా ఆడిపోసుకుంది. 


అయితే సభలో చర్చ అంతా ఒక ఎత్తు కాగా.. పార్టీ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు సభ వెలుపల మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్‌ తరఫున కోవర్టు లాగా జగన్‌ ఏపీలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి సంబంధంలేని, తెలంగాణ శాసనమండలి ఎన్నికలకంటె ముందు జరిగిన ఓ కేసును శాసనసభలో ప్రస్తావించడం తప్పు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ మీద కేసు పెట్టించిందని.. ఈ వ్యవహారంలో ఉపయోగించిన కెమెరాలు, ఎక్విప్‌మెంట్‌ సాక్షి టీవీకి సంబంధించినవి' అని ఆరోపించారు. ఈ ప్రకటనే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. 


సాక్షి టీవీకి ఇదివరలో జగన్‌ ఛైర్మన్‌గా ఉండేవారు. ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మీడియా సంస్థలో ఉన్న పదవులనుంచి తప్పించుకున్నారు. ఆయన కు సంబంధించిన మీడియా సంస్థగా ముద్ర వేసేందుకు, వారు కేసీఆర్‌ కు సహకరించారని బురద పులిమేందుకు కాలువ శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సాక్షి టీవీ పరువునష్టం దావా వేస్తే గనుక.. ఆయనకు చిక్కులు తప్పకపోవచ్చు. ఎందుకంటే.. వాడిన కెమెరాలు ఏసీబీకి చెందినవి అయినప్పుడు.. సాక్షి మీద ఏసీబీ ఆధారపడినట్లుగా ఉన్న కాలువ వ్యాఖ్యలు ఖచ్చితంగా వారు కూడా ప్రతిస్పందించేలాచేస్తాయి. దాంతో వివాదం మరింత ముదురుతుందని పలువురు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: