వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోను అసెంబ్లీ లాంజ్‌లోంచి తొలగించిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సాధారణంగా అయితే... వైకాపా సభలో యాగీ చేయడంతోనే ఈ పర్వం ముగిసిపోయి ఉండాలి. కానీ కేవీపీ పేరిట సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇవ్వడం ద్వారా తెలుగుదేశం ఈ పుండును మరింతగా కెలికింది. ఎథిక్స్‌ కమిటీ సిఫారసుల ద్వారా చర్యలకు ఉపక్రమిస్తే గనుక.. కేవీపీని అరెస్టు చేయించి జైలుకు కూడా పంపవచ్చునని యనమల వంటి ఆ పార్టీ నేతలు ఆశపడుతున్న సంగతి మనకు తెలుసు. అయితే.. కొన్ని టెక్నికల్‌ అంశాలను పరిశీలించినప్పుడు.. ఈ వివాదంలో ఎడ్వాంటేజీ కేవీపీ రామచంద్రరావుకే ఉన్నదని.. ఆయనను జైల్లో పెట్టడం అంత ఈజీ కాదని.. విచారణ పర్వాన్ని ఆయన సులువుగా తప్పించుకోగలరని కొందరు అంటున్నారు. 


టెక్నికల్‌ అంశాలను పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం వెల్లడిస్తున్న వారి వాదన ఇలా ఉంది. అసెంబ్లీ లాంజ్‌లోంచి వైఎస్‌ ఫోటోను తొలగించారు. దీనిపై రగడ ప్రారంభం అయింది. వైకాపా సభ్యులు శాసనసభ సిబ్బందిని నిలదీశారు. స్పీకరు చెప్పినట్లుగా లేదా శాసనసభ సిబ్బంది చెప్పినట్లుగా ఒక వాదన బయటకు వచ్చింది. అదేంటంటే.. 'సిబ్బంది లాంజ్‌ను శుభ్రం చేస్తుండగా.. వైఎస్‌ ఫోటో ఫ్రేము కాస్త ఊడి, దెబ్బతిన్నది. దాన్ని బాగుచేయించడం కోసం తీసి పక్కన పెట్టారు అన్నది.' ఇది ఒక సాకు కావచ్చు గానీ.. ముందు ఆ వాదన వెలుగులోకి వచ్చింది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫోటో గనుక.. స్పీకరు ఆదేశాల మేరకు దాన్ని తొలగించినట్లుగా తొలివిడతలో ఎక్కడా వార్తల్లో రాలేదు. అనుకోకుండా జరిగినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. 


ఆ తర్వాత కేవీపీ లేఖ రాయడం కూడా జరిగింది. కేవీపీ లేఖలోని 'అనాగరికం, అక్రమం' అన్న రెండు పదాలను పట్టుకుని తెలుగుదేశం హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అయితే కేవీపీ లేఖ రాసినది, సదరు అభ్యంతరకరమైన పదాలను వాడినది.. ''సిబ్బంది పొరబాటుగా తొలగించారని'' తెలిసి రాశారా, లేదా ''స్పీకరు ఆదేశాలతో తొలగించారని తెలిసి రాశారా'' అనేది ఇక్కడ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద పరిగణించాలి. ఆ వాక్యాలు స్పీకరును ఉద్దేశించినవి కాదని, ఆయనకు ఆపాదించడం సబబు కాదని.. సిబ్బంది చర్య అని తెలిసి రాశానని కేవీపీ వాదిస్తే గనుక.. ఆయన మీద చర్యకు ఆస్కారం కూడా ఉండదు. రకంగా.. ఆయన మీద చర్య తీసుకోవడానికి సభాపరంగా కసరత్తు జరుగుతున్నప్పుడు.. ఆయన దాన్నించి తప్పించుకోవడానికి కూడా అవకాశం మెండుగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: