ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చిట్టచివరి ఉప ముఖ్యమంత్రి.. కాలం కలసి వస్తే.. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని కూడా కాగలనని బలంగా పరితపించిన వ్యక్తి అయిన దామోదర్‌ రాజనరసింహకు ఇది కాస్త చేదు వార్త. ఆయన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. ఆయనను వరంగల్‌ ఎంపీ స్థానం కోసం జరుగుతున్న ఉప ఎన్నికలో అభ్యర్థిగా దించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆయన తప్ప పార్టీకి సరైన అభ్యర్థి మరొకరు లేరని పేర్కొంటూ టీపీసీసీ తరఫున ఇప్పటికే అధిష్ఠానానికి సిఫారసు వెళ్లినట్లుగా తెలుస్తోంది. 


నిజానికి ఈ ఉప ఎన్నికలో పోటీచేయడానికి దామోదర రాజనరసింహకు ఏమాత్రం ఇష్టం లేదని రాజకీయ వర్గాల్లో అందరూ చర్చించుకుంటున్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండదలచుకున్నానని.. కేంద్రానికి వెళ్లే ఉద్దేశంలేదని.. అందుకే ఎంపీస్థానం వద్దని ఆయన అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి వరంగల్‌ లో గెలిచే నమ్మకం లేకనే ఆయన దూరం జరుగుతున్నట్లు చెబుతున్నారు. 


అయితే టీపీసీ మాత్రం అనేక కాంబినేషన్లు పరిశీలించిన తర్వాత.. దామోదర రాజనరసింహకు మించిన అభ్యర్థి లేరని చాలా స్ట్రాంగుగా అధిష్ఠానానికి చెప్పారుట. అటునుంచి ఆదేశాలు వస్తే.. దామోదర తనకు ఇష్టం లేకపోయినా తప్పించుకోలేకపోవచ్చు. ఎందుకంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరించి.. అపప్రధ మూటగట్టుకోవడం కన్నా.. ఈ ఎన్నికలో ఓడిపోయి త్యాగమూర్తిగా నిలిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి సీఎం ప్రాబబుల్స్‌గా రేసులో ఉండచ్చునని ఆయన సమీకరణాలు ఆలోచించుకోవచ్చు. టీపీసీసీ చాలా మందిని బేరీజు వేసినా.. దామోదర వైపు మొగ్గడంలో తెరవెనుక మరో కారణం ఉన్నదనీ వార్తలు వస్తున్నాయి. ఆయనను కేంద్ర రాజకీయాలకు తరలిస్తే.. ఇక్కడ చీఫ్‌ బెర్తులకోసం పోటీ తగ్గుతుందనే ఆలోచన కూడా కొందరికి ఉన్నదని గుసగుసలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: