బీహార్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు గాను ప్రచారం పరిధిలు దాటి వ్యక్తిగత విమర్శల పర్వంలోకి కొట్టుకుపోతోంది. ఇదెంతవరకు వచ్చిందంటే మహాత్మాగాంధీ హత్యతో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధం ఉండవచ్చని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించేంత వరకు పోయింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌తో మోదీకున్న అనుబంధాన్ని ఎత్తిచూపుతూ లాలూ పై వ్యాఖ్యలు చేశారు. 


గత నెలలో కూడా రిజర్వేషన్ కోటాపై ఆరెస్సెస్, బీజేపీ వైఖరిని తప్పుపడుతూ లాలూ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న రిజర్వేషన్ కోటాను ఎత్తివేయాలని కోరుతున్న కాషాయ దళనేతలు తల్లి పాలు తాగి ఉంటే రిజర్వేషన్లమీద చేయి వేయడానికి సాహసించాలని లాలూ అప్పట్లో సవాలు చేశారు. అయినా సాధారణంగా బీహార్లో కులాల ప్రాతిపదిక మీద పార్టీలు నిత్యం కొట్టుకుంటూ ఉండడం. కులాలను బట్టే ఓట్లు రాబట్టు కోవడానికి ఆరాటపడుతూ ఉండడం సహజం. కానీ.. ఇలా ఓట్ల కోసం వివాదాల్లోకి మహాత్మగాంధీని కూడా లాక్కు రావడం.. మోడీకి, అనుచితమైన రీతిలో.. గాంధీ హత్యతో సంబంధం ఉంటుందంటూ.. నిరాధార అపరిపక్వ ఆరోపణలు చేయడం మరీ లేకిగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని, ఇప్పుడు నిజంగా రిజర్వేషన్లు ఎవరికి అవసరమో తేల్చడానికి రాజకీయేతర కమిటీని నియమించి నిగ్గుతేల్చాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవల ప్రకటించడం బీహార్ ఎన్నికల ప్రచారానికి ఆజ్యం పోసింది. కాగా బీహార్ శాసన సభ ఎన్నికలు అయిదు దశల్లో జరుగనున్నాయి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 దాకా జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు అటు బీజేపీకి, ఇటు లౌకిక పార్టీల కూటమికి కీలకం కావటంతో ప్రత్యర్థి వర్గాల మధ్య ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది. నేతల డీఎన్ఎలలో ఏదో తేడా ఉంది పరీక్షించుకోవాలనేంత స్థాయిలో వ్యక్తిగత దాడులు మొదలవటంతో బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: