ప్రభుత్వ పథకాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి.. కింది స్థాయిలో అర్హత గల లబ్ధిదారులు ఎవ్వరూ ఉపేక్షకు గురికాకుండా.. ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాల్ని పొందుతూ ఉండడానికి బోలెడంత ప్రభుత్వ యంత్రాగం జీతాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ యంత్రాగం తమ ప్రాథమిక బాధ్యత నిర్వర్తించడంలో ఫెయిలయితే ఏమవుతుంది? వారు సజావుగా వ్యవహరించకపోతే ఏమవుతుంది? ఏముంది.. అన్ని అర్హతలూ ఉండి కూడా ప్రభుత్వం అందించే పథకాల్ని పొందగల వారు వాటికి దూరమైపోతారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. 


ఈ విషయం బహుశా ఇవాళ చంద్రబాబునాయుడు దృష్టికి వచ్చి ఉండాలి. ఎందుకంటే.. గుంటూరు లో అన్ని అర్హతలు ఉండికూడా.. వృద్ధాప్య పెన్షను పొందలేకపోతున్న ఒక వృద్ధురాలి గురించి.. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. 


వివరాల్లోకి వెళితే.. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్న కోటీశ్వరి అనే ఇంజినీరింగ్‌ అమ్మాయి.. కమలమ్మ అనే వృద్ధురాలి దురవస్థను గుర్తించారు. కమలమ్మ అంటే.. భర్త కొడుకులను కూడా కోల్పోయిన 80 ఏళ్ల వృద్దురాలు. గతంలో 200 పెన్షను ఉండగా.. పొందుతున్న ఆమెకు, వెయ్యిరూపాయల పెన్షను అయిన తర్వాత.. పొందలేకపోతోంది. ఆమెపేరు జాబితాల్లో లేకుండాపోయింది. 


అయితే చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ అనుభవాలను చెప్పాల్సిందిగా విద్యార్థులను కోరినప్పుడు.. బిటెక్‌ స్టూడెంట్‌ కోటీశ్వరి.. కమలమ్మ గురించి చంద్రబాబుకు వివరించింది. ఆమె చెప్పిన వైనం విన్న చంద్రబాబునాయుడు చలించి పోయి అదే సభలో ఉన్న కమలమ్మను కూడా వేదిక మీదికి పిలిపించి.. ఆమెకు కలెక్టరు ద్వారా పెన్షను వచ్చే ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లు కోల్పోయినందుకు.. ప్రభుత్వం ద్వారా 25వేల ఆర్థికసాయాన్ని కూడ అందించారు. ఇలా ఆమె వృత్తాంతాన్ని తన దృష్టికి తీసుకువచ్చినందుకు కోటీశ్వరిని కూడ సీఎం అభినందించారు. 


కోటీశ్వరి చేసిన ప్రయత్నానికి మాత్రం ప్రతిఒక్కరూ శెభాష్‌ అనాల్సిందే. ఎందుకంటే... స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొనడం అంటే.. ఏదో మొక్కుబడిగా రోడ్లు ఊడ్చి వెళ్లిపోవడం మాత్రమే కాదు. ఈ రకంగా ఆ ప్రాంతంలోని జనజీవితాలతో కూడా మమేకమై పనిచేయడం అంటే.. దానివల్ల అనేక సామాజిక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇది ఒకరు నేర్పితే వచ్చే విద్య కాదు.. తాముగా ఫీల్‌ అయి నిర్వర్తించే సామాజిక బాధ్యత. అందుకే కోటీశ్వరికి అందరూ శెభాష్‌ అనాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: