వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం కారణంగా చావుతప్పి కన్ను లొట్టపోయిన చందాన అధికార పీఠం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరు ఏ  పని చేయాలో, ఏ పని చేయకూడదో కూడా ఆదేశించే స్థాయికి ఎదిగిపోయింది. ప్రజాసమస్యలపై ఎవరు ఏకాస్త నిరసన తెలిపినా వారి అర్హతల గురించి మాట్లాడటం  చంద్రబాబు నుంచి చోటామోటా నాయకులందరికీ అలవాటైపోయింది. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారుల భూతల స్వర్గంగా మార్చే క్రమంలో చంద్రబాబు అలుపెరుగకుండా పని చేస్తుంటే దీక్షలు, నిరసనల పేరిట అడ్డుకుంటున్న వారికి అలా చేసే అర్హత ఉందా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం విడ్డూరం. 


ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంత అవసరమో చెబుతూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి త్వరలో దీక్ష చేపట్టడానికి రంగం సిద్దం చేస్తుంటే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఎక్కడో కాలినట్లుంది. జగన్‌కు ప్రత్యేక హోదానే కాదు ఏ అంశంపైనయినా సరే దీక్ష చేసే అర్హత లేదు పొమ్మనేశారాయన. ప్రత్యేక హోదా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేసుకోకుండా ఏపీలో ప్రజలను ఎందుకు చెడగొడుతున్నారని ప్రశ్న సంధిచారాయన. 


ధూళిపాల నరేంద్ర వ్యవహారం చూస్తుంటే ఆంధ్ర్రప్రదేశ్ పారాహుషార్ చందంగా ప్రశాంతంగా ఉన్నట్లు మనం నమ్మేయాల్సి ఉంటుంది. తమ అధినేత కాలిక బలపం కట్టుకుని కాకుండా ప్రత్యేక విమానాల్లో దేశదేశాలు చక్కర్లు కొడుతుంటే తలూపి జైకొట్టడం కాకుండా ప్రజల్లో లేని పోని అనుమానాలు సృష్టిస్తున్నారని నిదిస్తున్న నరేంద్ర.. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా ఒక జాబితా తయారు చేసి జనం ముఖాన కొడితే బాగుంటుందేమో..?


అయినా అన్ని అర్హతలూ తమ ప్రభుత్వంలోని పెద్దలకు మాత్రమే ఉన్నాయని ఆయన అనుకుంటే అనుకోవచ్చు గాక.. అయినంత మాత్రాన వారి పార్టీ వారెవ్వరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు కదా. అర్హతలు ఉన్నవారు మాట్లాడరు.  మాట్లాడే వారికి అర్హత లేదంటారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న సామెత చందంగా ఉన్నది వారి వైఖరి



మరింత సమాచారం తెలుసుకోండి: