తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు చెప్పుకోడానికి గత 23వ తేదీన ప్రారంభం అయినట్లే ఉన్నాయి గానీ.. ఇప్పటిదాకా సభ జరిగిన రోజుల కంటే.. విరామంలో గడచిపోయిన రోజులే ఎక్కువ. సభ జరిగినరోజుల్లో కూడా చర్చ జరిగిన సమయం కంటె.. తగాదాలు, గొడవలు జరిగిన సమయమే ఎక్కువ. సభకు శ్రీకారం చుట్టిన తర్వాత..... రెండో సుదీర్ఘ విరామం తర్వాత.. సోమవారం మళ్లీ అసెంబ్లీ కొలువు తీరనుంది. అయితే ఈరోజు కూడా ఫలప్రదంగా ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ సాగే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎడాపెడా రైతు సమస్యల మీదే విరుచుకుపడిపోవాలని ప్రతిపక్షాలన్నీ ఉవ్విళ్లూరుతున్నట్లుగా తెలుస్తోంది. 


విరామం తర్వాత మొదలయ్యే అసెంబ్లీలాగా వాతావరణం కనిపించడం లేదు. సోమవారం సభ మొదలయ్యేందుకు కొంత ముందుగా.. దాదాపుగా అన్ని పార్టీలు కూడా.. తమతమ లెజిస్లేచర్‌ పార్టీలతో సమావేశం నిర్వహించుకుంటున్నాయి. ప్రభుత్వం మీద ఎలా దాడిచేసి ఇరుకున పెట్టాలా అనేది అన్ని విపక్షాలకు సింగిల్‌ పాయింట్‌ ఎజెండా కాగా, ప్రతిపక్షాల విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలా అన్నది.. తెరాస వ్యూహరచన. 


ప్రతిపక్షాల ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గకూడదని తెరాస చాలా పట్టుదలతోనే ఉంది. పైగా ఈరోజున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌.. వ్యాట్‌ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తలసాని అంటేనే తెలుగుదేశం పార్టీ మొత్తం ఒంటికాలిమీద లేచే అవకాశం ఉంది. తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలని, ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు రెండూ చాలా తీవ్రంగా డిమాండ్‌ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ తలసాని బిల్లు ప్రవేశపెట్టే సమయానికి.. బాగానే రభస జరగవచ్చునని అంతా అనుకుంటున్నారు. తలసాని సభలో మాట్లాడితే తాము సభలోనే ఉండబోం అంటూ విపక్షాలు గతంలో ఒక మారు హెచ్చరించాయి కూడా! 
మరి సోమవారం నాడు అసెంబ్లీ జరిగే సమయానికి ఎన్ని రగడలు అవుతాయో.. ఎన్ని మంటలు రేగుతాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: