అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని మరపురాని ఉత్సవంలా నిర్వహించాలని తపన పడుతున్న చంద్రబాబు సరికొత్త ఐడియాలతో ముందుకు సాగుతున్నారు. నభూతో న భవిష్యత్ అన్నరీతిలో ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఊరికే శంకుస్తాపన చేయడం కాకుండా.. ఈ వేడుక కలకాలం గుర్తుండేలా.. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా వినూత్న కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. 

అమరావతిలో టైమ్ క్యాప్స్యూల్ ఏర్పాటు చేయాలనే సరికొత్త ఆలోచన ఆశ్చర్యపరుస్తోంది. రాజధాని నిర్మాణం.. అందుకు దారి తీసిన పరిస్థితుల్ని పర్మినెంట్ గా అందరికీ గుర్తుండేలా ఓ టైమ్ క్యాప్సూల్ ను భూమిలో పాతిపెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాజధాని ఎంపిక, రాజధాని బిల్లు, భూసమీకరణ వంటి కీలక పరిణామాలను ఈ టైమ్ కాప్స్యూల్ లో పొందుపరుస్తారు. 

భవిష్యత్ తరాలు.. ముందు ఈ టైమ్ క్యాప్స్యూల్ ను ఓపెన్ చేసి చూస్తే.. మరపురాని అనుభూతికి లోనవుతారనేది దీని వెనుకున్న కాన్సెప్ట్. మనదేశంలో ఇలాంటివి కొత్తే. అంతే కాదు.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ సందడి రాజధాని ప్రాంతానికే కాకుండా రాష్ట్రమంతటా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నిగ్రామాల్లో  కార్యక్రమాలు నిర్వహించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 

అంతేకాదు.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు శంకుస్థాపన వేళ పట్టుబట్టలు, పసుపుకుంకుమ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 16వేల గ్రామాల నుంచి మట్టి తెచ్చి శంకుస్థాపన స్థలం వద్ద ప్రత్యేక నిర్మాణం చేపడతారట. రాష్ట్రంలో మారు మూలన ఉన్న శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి క్రీడా జ్యోతులను పాదయాత్ర ద్వారా శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈవెంట్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. కాదంటారా..!?


మరింత సమాచారం తెలుసుకోండి: