పార్టీలో కొత్తగా పదవులు పొందిన వారికి ఏదో చేసేయాలనే నేతల అత్యుత్సాహం ఉంటుంది. ఎలాగైనా తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. తెలుగుదేశంలో అయితే. అలా ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. ఏముందీ.. ఎంచక్కా జగన్ ను కార్నర్ చేసి నాలుగు ఆరోపణలు గుప్పిస్తే చాలు. అలాంటి ఆరాటంలో కొత్త ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పలువురు నవ్వుకుంటున్నారు. చంద్రబాబును ఇంప్రెస్ చేయడం అంటే.. జగన్ ను తిట్టడమే అనే భావన నేతల్ని లెక్కలు చూసుకోకుండా మాట్లాడేసేలా ప్రేరేపిస్తున్నదేమో అనిపిస్తోంది.


 భోగాపురం విమానాశ్రయ భూసేకరణకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఆయన  ఈ వ్యాఖ్యలు చేసారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా గ్రామస్థులు గత 27 రోజులుగా దీక్షా శిబిరాలను సందర్శించిన జగన్ పెద్దవాళ్ళ భూములను వదిలి పేదల భూములపై పడ్డారని అధికార తెదేపాపై విరుచుకు పడ్డారు. అయితే దీనిని సమర్ధంగా ఎదుర్కోవడంలో కళా వెంకటరావు లెక్కలు తప్పడం స్పష్టంగా తెలుస్తోంది.  విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన 5,311 ఎకరాల భూమిలో 80 శాతం జగన్ కు చెందిన బినామీలవని విమర్శించిన కళా ఆ లెక్కలు పూర్తి చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డారు.  నిర్దేశిత 5,311 ఎకరాల భూమిలో 633 ఎకరాల భూమి ప్రభుత్వ అటవీ భూములుగానూ, 700  ఎకరాల భూమి డి పట్టా భుములుగానూ వివరించిన ఆయన తద్వారా 25 శాతం భూమి ప్రభుత్వానిదిగా తేల్చేసారు. మిగిలిన భూమిలో 1000ఎకరాల భూమి కేవలం ముగ్గురు రైతుల చేతుల్లో వుందని ఆరోపించిన ఆయన 80 శాతం భూమిని జగన్ బినామీలదిగా చెప్పడం చాలా హాస్యాస్పదంగా వుందని పలువురు భావిస్తున్నారు. 


 ఈ లెక్కలు చూసినట్లైతే మొత్తం భూమి ప్రభుత్వానిది, జగన్ దే అయితే మరి రైతులంతా ఎక్కడినుంచి వచ్చినవారో కళా గారే చెప్పాలి. లేదా గ్రామీణ రైతులందరినీ.. మూకుమ్మడిగా జగన్ బినామీలుగా మెయింటైన్ చేస్తున్నాడా అనేది కూడా ఆయనే వివరించాలి. కొత్తగా పార్టీకి వచ్చి పదవులలో వున్న కళా వెంకటరావు లాంటి వారు ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలతో అంతో, ఇంతో ప్రజాభిమానం చూరగొన్న ప్రతిపక్షనేత జగన్ ను విమర్శించే ముందు కాస్త లెక్కలైనా చూసుకొంటే బాగుంటుందని పలువురు పార్టీ నేతలు భావిస్తున్నారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: