విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ భూసేకరణపై ప్రతిపక్షనేత జగన్ చేసిన విమర్శలు ఏపీ మంత్రుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మంత్రులు గంటా, అయ్యన్న పాత్రుడుల భూములు పోకూడదనే రైతుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని జగన్ చేసిన విమర్శలు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారాయి. భూసేకరణ ప్రాంతానికి సమీపంలోనే మంత్రి అయ్యన్నపాత్రుడి రిసార్ట్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 

భూసేకరణలో టీడీపీ నాయకుల భూములు పోకుండా, పేదల భూములను తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారని జగన్ తన జిల్లా పర్యటనలో మండిపడ్డారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణం జరుగుతోందని మండిపడ్డారు. బలవంతంగా భూములు తీసుకుంటే,మూడేళ్లలో ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో పడేసే రోజు వస్తుందని,ఆ తర్వాత తమ పార్టీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికి వెనక్కి ఇస్తామని అన్నారు. 

జగన్ విమర్శలతో ఆంధ్రామంత్రులు స్పందించాల్సి వచ్చింది. బోగాపురం వద్ద అయ్యన్నపాత్రుడు భూములు ఉన్నాయా? గంటా భూములు ఉన్నాయా?అన్నది సమస్యకాదని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం భూముల ఎంపిక జరిగిందని మంత్రి అయ్యన్నపాత్రుడు వివరణ ఇచ్చుకున్నారు. విపక్ష నేత జగన్ నోటికి వచ్చినట్లు ఆరోపణలుచేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. 

ఐతే.. అక్కడ తనకు రిసార్ట్ ఉన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు.. జగన్  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది బెస్ట్ రిసార్టు అని మెచ్చుకున్నారని కూడా చెప్పారు. సాంకేతికంగా అవసరం అనుకుంటే.. అధికారులు సూచిస్తే తాము రిసార్టు భూములు వదులుకోవడానికి సిద్దంగా ఉన్నామని అయ్యన్నపాత్రుడు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: