అమరావతి శంకుస్థాపన కలకాలం గుర్తుండే సంబరంలా నిర్వహించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో 200 మండలాలు కరవును ఎదుర్కొంటున్నాయని ఓవైపు అధికారులే నివేదికలు ఇస్తున్నా.. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన పండుగ కాబట్టి ఖర్చుకు వెనుకాడకూడదని ఏపీ సర్కారు పట్టుదలతో ఉంది. ఆరంభమే అదిరిపోతే.. అమరావతికి తిరుగుండని భావిస్తోంది. 

అమరావతి శంకుస్థాపనకు దాదాపు 2000 మంది వరకూ విదేశీ అతిథులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ విజయవాడ, గుంటూరుల్లోనే బస ఏర్పాట్లు చేస్తారట. మరి విదేశీ అతిథులకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా వారి స్థాయికి తగిన ఏర్పాట్లు చేస్తారట. అందుకే అందుబాటులో ఉన్న స్టార్ హోటళ్లన్నింటినీ ఇప్పటికే బుక్ చేశారట. 

అంతేకాదు.. వారు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేందుకు విదేశీ లగ్జరీ కార్లను తెప్పిస్తున్నారట. ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్‌ వంటి కంపెనీల కార్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారట. వారి ఆతిథ్యంలో ఎలాంటి లోటూ రాకూడదని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. విదేశీ అతిథులందరికీ కార్లంటే కష్టం కాబట్టి వీవీఐపీలకు వెయ్యివరకూ ఫారిన్లు కార్లు ఏర్పాటు చేసి.. మిగిలివారి కోసం ఏసీ బస్సులు ఉపయోగిస్తారట.  

వంటకాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దేశ, విదేశాల నుంచి వస్తారు కాబట్టి.. వారి వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ డిషెస్ చేయించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఇప్పటికే ప్రముఖ హోటళ్లకు అప్పగించేశారట. అలాగే ఏపీ స్పెషల్ వంటకాలను కూడా వారికి పరిచయం చేస్తారట. వీరి భద్రత కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. సో.. ఈనెల 21 నుంచి 23 వరకు అమరావతి విదేశీయుల సందడితో కళకళలాడనుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: