ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే హైటెక్ పదానికి పర్యాయపదం.. అందుకే ఇప్పుడు పరిపాలనలోనూ హైటెక్ పద్దతుల జోరు పెంచేస్తున్నారు. ఇప్పటివరకూ నగరాలు, పట్టణాలకే పరిమితమైన టెక్నాలజీని ఇక పల్లెబాట పట్టిస్తారట. పల్లెటూళ్లలో ఇంటర్ నెట్, ఆన్ లైనా అని ఆశ్చర్యపోకండి.. అదెప్పటి నుంచో కాదు.. వచ్చే జనవరి నుంచే..
  
కొత్త సంవత్సరం నుంచి అన్ని పంచాయితీల్లో 11 రకాల పౌర సేవలు ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు పాస్ చేశారు. అంటే ఇకపై గ్రామాల్లో ఏ పనులు కావాలన్నా.. సింపుల్ గా ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవడమే అన్నమాట. ఈ సేవ రాకతో మండల స్థాయి అధికారుల లంచాలు చాలావరకూ కంట్రోల్ అయ్యాయి. 

ఇప్పుడిక ఈ పల్లెల్లోనూ హైటెక్ పాలన వస్తే... చిన్నస్థాయి ఉద్యోగుల ఆమ్యామ్యాలకు కళ్లెంపడొచ్చు. కానీ పల్లెటూళ్లలో నెట్ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందాయా.. అంతా నెట్ లో అప్లయ్ చేసుకునే రేంజ్ కు ఎదిగారా.. అన్న అనుమానం రాకమానదు. కానీ అప్ డేట్ చేస్తేనే కదా.. అప్ డేట్ అయ్యేది. ఎప్పుడో ఒకసారి మొదలుపెట్టాల్సిందే కదా.. ఇప్పుడు చంద్రబాబు ఆ పనే చేస్తున్నారు. 

గృహానిర్మాణాలు, లేఔట్ అనుమతులు వంటి వాటి కోసం ఇప్పటికే మున్సిపల్ ఆఫీసుల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌ వేర్‌ను వాడుకోవాలని చంద్రబాబు అధికారులకు సలహా ఇచ్చారు. అంతేకాదు. పల్లెటూళ్లలో ప్రతి ఇంటినీ నెంబర్ ఉండాలని.. ప్రతి వీధికీ బోర్డులు ఉండాలని ఆదేశించారు.
 
ప్రతి ఇంటి వివరాలతో విలేజ్ మ్యాప్ లు తయారు చేసి నెట్లో పెడితే భూ అక్రమాలు తగ్గుతాయని చంద్రబాబు సూచించారు. పరిపాలనలో అవినీతిని పారద్రోలేందుకు టెక్నాలజీ ఓ మంచి సాధనం. ఈ ఐటీ యుగంలో దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత సత్ఫలితాలు వస్తాయి. ఆ దిశగా అడుగులేస్తున్న నవ్యాంధ్రకు స్వాగతం పలకాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: