ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రభుత్వ విధానం ఏమిటో.. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు ఎలా ముందుకు సాగిపోవాలో.. ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. శాసనసభ ముగిసిన తర్వాత.. పార్టీ ఎల్పీ సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. మన మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎంతమాత్రమూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తన సహచరులకు ధైర్యం చెప్పారు. వారందరి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే, ప్రజలకు మాత్రం నిత్యం జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు సందేశం ఇచ్చారు. 


ఈ టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో.. అనేక అంశాలకు సంబంధించి.. గులాబీ అధినేత క్లారిటీ ఇవ్వడం విశేషం. రాబోయే రోజుల్లో పార్టీ ఎదుర్కోబోతున్న వివిధ ఎన్నికలు, అందులో విజయావకాశాలు... ఇప్పటికే బాస్‌ జరిపించిన సర్వే అంచనాల వివరాలు, నామినేషన్‌ పదవుల పందేరం, మిషన్‌ కాకతీయ పనులకు అదనపు విడుదలలు ఇలా అనేక అంశాలను ఆయన వెల్లడించారు. 


వీటిలో ఎన్నికల అంశమే ప్రధానమైనది. పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర హైదరాబాద్‌ ఎన్నికలు మాత్రం జనవరిలో జరిగే అవకాశం ఉన్నదని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. వరంగల్‌ ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖరారు అని తేల్చేశారు. అక్కడ తమ పార్టీకి 67 శాతం విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే.. పార్టీ నారాయణఖేడ్‌ బైఎలక్షన్‌ బరిలో కూడా దిగుతుండగా.. అక్కడ పోటాపోటీ ఉండవచ్చునని కేసీఆర్‌ అంచనా. అక్కడ పార్టీకి 52 శాతం విజయావకాశాలే ఉన్నాయని ఆయన చెప్పారు. 


కార్పొరేషన్‌ పదవుల్ని త్వరలోనే పంపిణీ చేస్తాం అని.. ప్రధానంగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు మాత్రం ఇందులో అవకాశం ఉంటుందని, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, పార్టీకోసం పనిచేసిన కీలక నాయకులు ఉంటే వారి పేర్లు సిఫారసు చేయాలని కోరారు. పార్టీని విమర్శించే వారి గురించి పట్టించుకోవద్దని, ప్రజలకే జవాబుదారీగా సాగిపోవాలని హితవు చెప్పారు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికల విషయంలో మాత్రం గులాబీ బాస్‌ మాంఛి కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: