వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా పనికిరానివాడని తేల్చేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. పట్టిసీమ పథకానికి అడ్డుపడిన జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అంటూ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఉప సీఎం విమర్శించారు. జగన్ ప్రతిపక్ష నేతగా పనికొస్తాడో లేదో తర్వాతి విషయం కానీ, చంద్రబాబు హయాంలో రాయలసీమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని చూస్తూ కూడా, అన్నీ తెలిసీ కూడా మన్ను తిన్న పాముల్లా పడున్న రాయలసీమ తెలుగుదేశం నేతలూ, కేఈ కృష్ణమూర్తి వంటి సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నట్లు, పనికొచ్చే ఏ పని చేస్తున్నట్లు అనేది ప్రజలకు అర్థం కావటం లేదు. అయినా ప్రతిపక్ష నేతను ఎన్నుకునేది.. రెండోస్థానంలో సీట్లుసంపాదించిన పార్టీనే గానీ.. కేఈ కాదు కదా. నేతల అర్హతల గురించి మాట్లాడడానికి.. ప్రతిపక్ష నేతను కూడా తామే ఎన్నుకుంటే బాగుండునని కేఈ కోరుకుంటున్నట్లుగా ఉంది.


ఒకవైపు సాక్షాత్తూ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్టిసీమ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ కపటత్వాన్ని ఏకపడేస్తుండగా సీమనేతలకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం ద్రోహం కాదా? పట్టిసీమ నుంచి చుక్క నీరు సీమకు రాకున్నా, తెప్పించకున్నా ప్రభుత్వం మాత్రం సీమ జనాల ముందు ఏదో జరగబోతోందని నాటకం ఆడుతుండటంపై బీజేపీ ఎమ్మెల్సీ నిగ్గదీశారు.. వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు కేంద్రం ఇస్తున్న నిధులను పైసా ఖర్చుపెట్టకుండా చంద్రబాబు బ్యాంకుల్లో దాచి వడ్డీ తీసుకుంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు.


ఇవన్నీ మీ చెవులకు వినబడలేదా మంత్రివర్యా? సీమ బాధలు, వ్యథలు గురించి ఓనమాలు తెలియని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీ పక్కనే నిలబడి రాయలసీమ రతనాల సీమే కానీ రాళ్లసీమ కాదని మోసపు మాటలు గుప్పిస్తుంటే తల పంకించడం తప్ప స్పందించని మీరు జగన్ గురించో మరొకరి గురించో అవాకులు చవాకులు పేలడం ఎందుకని జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇతరులు ఎవరూ పనికిరారు మరి మీరయినా ఆ పనికొచ్చే పనులు చేసి పెట్టి ప్రజల్లో గుర్తింపు పొందవచ్చు కాదా.. అని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి కేఈ గారూ..


అయినా చంద్రబాబునాయుడు రాలయసీమకు ద్రోహం చేస్తున్నాడని నమ్మే సొంత పార్టీ నాయకుల్లో కేఈ ముందు వరుసలో ఉంటారని పార్టీ నాయకులు అంటూ ఉంటారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఆ కడుపుమంటను బహిరంగంగానే వెళ్లగక్కారు కూడా. కాకపోతే.. ఇప్పుడు చంద్రబాబుతో తనకు సత్సంబంధాలు లేవు గనుక.. ఆయనతో మళ్లీ బంధాలు పునరుద్ధరించుకోవడానికి ప్రతిపక్ష నేతను తిడితే సరిపోతుందని ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: