కొన్ని రోజుల క్రితం.. పెట్టుబడుల సాధనలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు రెండో ర్యాంకు వచ్చిన వార్త మీడియాలో హల్ చల్ చేసింది. ప్రత్యేకించి పసుపు మీడియా దీన్ని హైలెట్ చేసింది. వరల్డ్ బ్యాంకు ర్యాంకు వార్త, దానికి వచ్చిన స్పందనలతో రెండు, మూడు రోజుల పాటు పత్రికల్లో బాబు భజన ఫుల్లుగా జరిగిపోయింది. 

అంతేకాదు.. ఏపీ ఈ ర్యాంకు సాధించడంపై కేంద్ర మంత్రి వెంకయ్య కూడా చాలా సంతోషం.. బాబు గ్రేట్ అంటూ స్పందించారు. ఐతే.. ఈ ర్యాంకుల పట్ల అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదటి ర్యాంకు గుజరాత్ కు రావడంపై ఎవరికీ అనుమానాలు లేకున్నా.. ఇంకా రాజధాని కూడా కుదురుకోని ఏపీకి రెండో ర్యాంకు రావడం ఆశ్చర్యపరిచింది. ఏపీ విషయమే కాదు.. మొదటి 5లో మిగిలిన 4 రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం. 

ఈ ర్యాంకుల్లో తెలంగాణ 13వ స్థానంలో రాగా.. తమిళనాడు వంటి రాష్ట్రం కూడా 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ర్యాంకుల ప్రకటనకు కొన్ని రోజుల ముందే.. తమిళనాడు నిర్వహించిన పెట్టుబడుల సదస్సు దాదాపు లక్షా 70 వేల కోట్లరూపాయల పెట్టుబడులు ఆ రాష్ట్రం సాధించింది. అలాంటి రాష్ట్రం కూడా 12 వస్థానమే సంపాదించింది.

ఇప్పుడు ఈ ర్యాంకుల గుట్టును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెడుతున్నారు. అది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకులు కాదని.. కేఎంపీజీ అనే సంస్థ ఇచ్చినవి మాత్రమేనని ఆయన చెప్పారు. అంతేకాదు.. సదరు సంస్థ ఇలాంటి ర్యాంకులు ఏటా ప్రకటించదని.. కేవలం మోడీ కోరిన మీదటే సర్వే చేసి ఇలాంటి ర్యాంకులు ప్రకటించిందని గుర్తు చేశారు. 

మోడీ అడిగారు కాబట్టి గుజరాత్ కు మొదటి ర్యాంకు... సర్వే ప్రశ్నలకు బూటకపు సమాధానాలు చెప్పినందుకు ఏపీకి రెండు ర్యాంకు వచ్చిందని.. అలా మేనేజ్ చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని ఉండవల్లి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి కనీసం ఒక్క పరిశ్రమ కూడా రాకుండానే ఏపీకి రెండో స్థానం ఎలా వచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: