తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ మొదటి నుంచి చెబుతూవస్తున్నారు. ఇప్పుడు ఆ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.  కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన వేసిన కమిటీ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు చేరే అవకాశం ఉంది.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు కోసం కేసీఆర్ కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాజీవ్ శర్మ కమిటీ అధ్యయనం కొనసాగిస్తోది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టూ కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటవుతాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కొనసాగిస్తూ.... రాజధాని శివారు ప్రాంతాలతో చేవెళ్ల, షాద్ నగర్, భువనగిరి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారట. భువనగిరి కాకపోతే.. ఆ అవకాశం బీబీనగర్ కు దక్కుతుందట.

ఇక మహబూబ్ నగర్  జిల్లాలో షాద్ నగర్ తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు వస్తాయట. నల్గొండ జిల్లాలో భువనగిరితో పాటు సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందట. కరీంనగర్ లో జగిత్యాల కేంద్రంగా మరో జిల్లా, ఆదిలాబాద్ లో మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతాయట.

ఇక , మెదక్ లో కొత్తగా సిద్దిపేట జిల్లా ఏర్పాటవుతందట. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లా, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లా వస్తాయట. వరంగల్ జిల్లాలో మాత్రం కొత్త జిల్లా లేదట. కాకపోతే.. వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కొత్త జిల్లాల్లో కలుస్తాయట.  మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ , ఖమ్మం జిల్లాలో భద్రాచలం, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నా... వివిధ కారణాల వల్ల ఆయా జిల్లాల ఏర్పాటు సాధ్యంకాదని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: