మన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులను.. వారి పుట్టుకకు కారణమైన పూర్వీకులను నిత్యం పూజించుకోవడం మన కర్తవ్యం. ఐతే.. గుణవంతుడైన సంతానం వల్ల పితృ దేవతలకు సత్ గతులు కలుగాయన్నది హైదవ విశ్వాసం.. అందుకు భగీరథుడు ఓ మంచి ఉదాహరణ. ఆయన తన పితృదేవతలకు సత్ గతులు ప్రాప్తించాలని ఏకంగా గంగాదేవినే భువిపైకి దించాడు. 

మరి మనమేం చేయాలి.. భగీరథుడిలా ఘోర తపస్సులు చేయలేకపోయినా మన శక్తి మేరకు అందుబాటులో ఉన్న పద్దతుల ద్వారా పితృ దేవతలను సంతృప్తి పరచాలి.  ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. కామ్య వృషోత్సర్జన కల్యాణ కార్యక్రమం. అంటే ఆబోతుకూ, గోవుకు వివాహం జరిపించడం. దీని వలన మంచి గో సంతానం కలిగి పితృదేవతలకు స్వర్గలోకప్రాప్తి జరుగుతుందని చెబుతారు. 

గోవు, ఆబోతు పెళ్లే కదా అని తూతూ మంత్రంగా సాగించకుండా సాధారణ వివాహ కార్యక్రమంలాగానే ఈ పెళ్లి జరిపించాలి. హోమం.. వేద మంత్రాలు.. పసుపు దంచడం.. అన్నీ సంప్రదాయబద్దంగా జరగాలి. ఇలా చేస్తే వంశవృక్షానికి చెందిన 27 తరాల వారి ఆత్మకు శాంతి కలుగుతుందట. గౌరీపూజ, పందిరి రాట వెయ్యడం మొదలుకొని మంగళస్నానాలు, ఉపనయనం, జీలకర్ర బెల్లం, కన్యాదానం చేయడం, తాళికట్టడం, తలంబ్రాలు పొయ్యడం.. ఏడడుగులు నడిపించడం.. ఇవన్నీ ఈ పశువుల పెళ్లిలో నిర్వహించాలి. 

ఆబోతు - గోమాత వివాహం తర్వాత.. ఆ ఆబోతుకు అచ్చువేస్తారు. ఆ తర్వాత గోశాలకు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దేవతల్ని సంతృప్తి పరచడంతో పాటు వర్షాలు పడి.. సమాజం పాడిపంటలు, సుఖశాంతులతో వర్ధిల్లుతాయని పెద్దలు చెబుతున్నారు. సైన్స్ పరంగా చూసినా దేశీయ జాతి పశు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిన తరుణంలో.. ఇలాంటి ఆబోతు-గోవు వివాహాలు జరగాలని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: