విజయం సాధించాలని అంతా కలలు కంటారు. కానీ కొందరే దాన్ని సొంతం చేసుకుంటారు. ఎందుకు.. ఇది తెలుసుకోవాలంటే మనం ముందు కాలం గురించి కాస్త ఆలోచించాలి. పరిణామలక్షణం కలిగింది కాలం. ఆ పరిణామాలన్నీ మేలు కలగాలని ఆశించి, రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకోవడం మనం చేయవలసిన మొట్టమొదటి పని.

అంటే మంచి ఫలితానికి మొదటి మెట్టు మంచి సంకల్పమే. తన్మే మనః శివ సంకల్పమస్తు.. అని చెబుతుంది వేదం. అంటే నలుగురి మంచినీ కోరుకునే శుభ సంకల్పమే శుభఫలాలను సాధిస్తుందని అర్థం. ఈ సంకల్పాలతో కూడిన ఆకాంక్షలతో కాలానికి ఆహ్వానం పలకడం సత్సంప్రదాయం. అందుకే ఎప్పుడూ అంతా మంచి జరగాలని కోరుకోవాలి.

సమూహ సౌఖ్యాన్ని కోరుకునే వ్యక్తత్వంలో ముఖ్యమైంది సౌమనస్య భావన. ఒకరిపట్ల ఒకరికి స్నేహం కలగడానికి ఈ భావనే ప్రధాన కారణం. అంటే పరస్పర సానుకూలత ఉంటే స్నేహం చిగురించడం వేగవంతమవుతుంది. అయితే ఈ కాలంలో ఈ సౌమనస్య భావన అందరిలోనూ తగ్గిపోతోంది. 

పొరుగువాడితో స్నేహం పెంచుకునే తత్వం తగ్గిపోతోంది. నేను, నా.. అనే భావన పెరిగిపోవడమే ఇందుకు కారణం. మనిషితో మనిషి కలిసి బతకలేని దౌర్భాగ్యం దాపురిస్తోంది. ఇంతటి దారుణం జంతువుల్లోనూ ఉండదన్న సంగతి గుర్తుంచుకుని స్నేహభావం పెంపొందించుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: