ఒక బ్రాహ్మణుడు సకల శాస్త్రములు చదివిన వాడయ్యును దైవమునందు నమ్మకములేక పూర్వాచారములను లెక్కచేయకుండెను. ఇటులుండగ వాని కుమార్తెకు యుక్తవయసు వచ్చినది. ఆమె బహిష్ట అయినప్పుడు సయితము యింటికి దూరముగ నుండక మైల నింటనే గలుపుచుండెను. ఆ పాపఫలంబున వారి యిరువురకు గూడ భయంకర మయిన కుష్టువ్యాధి సంక్రమించినది. ఆ సమయంబున అయిన వారందరు దూరమయిరి. ధన్యవాదములు క్షీణింపసాగినవి.

విచారమున మునిగిన యా బ్రాహ్మణుడు అడవికిపోయి సూర్యభగవానుని గురించి ఘోర తపస్సు చేయగ ప్రభాకరుడు ప్రత్యక్షమయి ఓయి! నీ కుమార్తె ముట్టు మయిల యింటిలో కలిపినది. నీవు దానిని అంగకరించితివి కావుననే మీకి కష్టము వచ్చినది. నీవి సమీప గ్రామంబుననున్న గ్రామ పురోహితుని కుమార్తె అన్నముముట్టని ఆదివారము నోము పట్టియున్నది. నీవు వారింటికి పోయి యొక వారము ఫలము ధారవోయుమని అడుగుము, నీకంతట శుభమగునని చెప్పగా బ్రాహ్మణుండటులనే దరి గ్రామములోని పురోహితు వారింటికి పోయి సూర్య భగవానుని మాటలు వారికి వివరించి చెప్పెను.

పురోహితులవారి కుమార్తె సూర్యభగవానుని మాట ప్రకారముగ తన వ్రతఫలము నుండి కొంతభాగం బ్రాహ్మణునకు ధారపోయగనే వాని కుష్టువ్యాధియంతయు మాయమయిపోయినది. అంత యింటికి వచ్చిన బ్రాహ్మణుడు కుమార్తెచేత అపరాధము చెప్పించి అన్నము ముట్టని ఆదివారము నోము పట్టించి నందున ఆమె వ్యాధియు నయమయి, వివాహము చేసికొని సిరి సంపదలతో తులతూగినది.

ఉద్యాపనము:- ఈ నోముకు మాఘమాసమునందలి పూర్ణిమకు ముందువచ్చెడి యాదివారము తగినది. ఆనాడు తాను పరిశుభ్రముగ తలంటు స్నానము చేసి మడిబట్ట ధరించవలయును. ఇల్లు శుచి చేయవలయును. దేవతార్చన చేయు స్థలమును పంచరంగుల ముగ్గులతో నింపవలయున. మండపముపోసి ముందు వినాయకుని, తరువాత సూర్యదేవుని పూజింపవలయును. 133 నేతి బూరెలు రాగిపాత్రలో నుంచి, నూతన వస్త్రములతో 12 మంది బ్రాహ్మణులకు వాయనము నీయవలయును. ఎవరయినా నీ వ్రతము చేయవచ్చను. శక్తిలేనివారు కథ వినిన మరు సంవత్సరము వారికాశక్తి కలుగును. వ్రతలోపమైనను భక్తిలోపము కానియెడల ఫలము దక్కును.


మరింత సమాచారం తెలుసుకోండి: