నిర్మల గౌరీ నోము కథ
చిరకాలము సంతానములేని యొక గృహస్థుడు భార్యాసమేతముగ యిల్లు వీడిచిపోయి దివ్యక్షేత్రములు సందర్శించుచు కొంతకాలమునకు కాశీక్షేత్రమునకు సమీపమునందలి యొక మఠములోని సాధువు మహమహిమా సంపన్నుడని విని, వారిని దర్శించి సాష్టాంగముగ నమస్కరించి తన విచారమును బాయుటకు ఉపాయము తెలుపుమని కోరెను.

ఆ సాధువు తన్నాశ్రయించిన దంపతులయెడ దయగలవాడై "దంపతులారా..! మీరు నిర్మలగౌరి నోముపట్టిన మీకు తప్పక సంతానము కలుగును. దాని విధానమును చెప్పెద వినుడు. మీరింటికిపోయి నిమ్మచెట్టు వేరును తెప్పించి దానిచే గౌరీదేవీ ప్రతిమను తయారు చేయించుకొనుడు. మాఘశుద్ధ సప్తమిన (రథసప్తమి నాడు) ఇంటిని శుభ్రము చేసికొని, మండపము పెట్టి, నిమ్మవేరుతో చేసిన గౌరిని పసుపుకుంకుమలతో అలంకరించిన పిదవ ప్రతిష్ట చేయవలెను. అప్పటి నుండి ఆ ఏడాదంతయు ప్రతి సప్తమీలందున దేవి ఆరాధించి కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనుచు, తరువాత పదమువ్వురు పేరంట్రాండులను పిలిచి ప్రతియొక్కరిని పండ్లు, పూలు, నల్లపూసలు, కోవలు, లక్కజోళ్ళు, అయిదేసి నిమ్మపండ్లతో దక్షిణ తాంబూలములనీయవలెను. శక్తిగలవారింకను వైభవముగ వారికి భోజనముల పెట్టి నూతన వస్త్రమియ్యుట మంచిదని చెప్పెను.

ఆ మాటను వినిన దంపతులు తిరిగి యింటికి చేరి సక్రమముగ నిర్మలగౌరి వ్రతముచేసి ఇల్లునిండుగ సంతానమును పొందిరి.

ఉద్యాపనము:- కథయందే చెప్పబడినది. వ్రతలోపమైనను, భక్తిలోపము కానియెడల ఫలము దక్కును.


కార్తీక చళిమిళ్ళ నోము కథ

రాజకుమార్తెయు, మంత్రి కుమార్తెయు నొకదినమున రాజపురోహితుని చూచి బ్రాహ్మణోత్త్తమా! సకల శుభములనిచ్చు వత్రము నొకదానిని తెలుపమనగా ఆ విప్రుడు "కన్యలారా! మీరు కార్తీక చలిమిళ్ళ నోము పోయుడు. కార్తీకపౌర్ణమినాడీ వ్రతము ప్రారంభింపవలయును. ఆ సంవత్సరము ఐదుశేర్ల బియ్యముతో చేసిన చలిమిడిని ఐదుగురు ముత్తైదువులకును, రెండవ సంవత్సరము పదిశేర్ల బియ్యముతో చేసిన చలిమిడిలను పదిమంది ముత్తయిదువులకును, మూడవఏడు పదునయిదు శేర్ల బియ్యముతో చేసిన చలిమిడిని పదునయుదుగురు ముత్తైదువులకు వాయనము లీయవలయును. దక్షిణ తాంబూలములు ఈయవలయును. యిష్టమృష్టాన్నములు పెట్టవలయునని చెప్పిరి.

వారిలో మంత్రికూతురు వ్రతమును నియమముతో చేసి యొక సామ్రాజ్యమునేలు రాజునకు భార్యయై ఎంతో ఐశ్వర్యమునను భవించినది. రాజకుమారి మదోన్మాదమున వత్రమునుల్లంఘించిన కారణమున దరిద్రురాలయి భర్తచే వెడలనంపబడి యడవులంబడి దుఃఖించుచు బోవుచుండగ పార్వతీపరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చి "అమ్మాయీ! వ్రతోల్లంఘనము చేసినందున నీకీలోపము కలిగినది. అపరాధము చెప్పుకొని మరలనోము పట్టమనగ నామె తిరిగి కార్తీక చలిమిళ్లనోమునోచి సర్వసౌఖ్యముల ననుభవించినది.

ఉద్యాపనము:- కథ యందే చెప్పబడినది.


మరింత సమాచారం తెలుసుకోండి: