తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం  సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  

Image result for స్వర్ణరథంపై

స్వర్ణరథంపై మెరిసిన  లోకమాత  
సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4.10 నుండి 5.00 గంటల వరకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. కాగా రాత్రి 7.00 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. 

Image result for గరుడ వాహనంపై

గరుడ వాహనంపై చైతన్యస్వరూపిణి : 
రాత్రి 8.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరుగనుంది. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు.  గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు.

గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: