ఉరిమే ఉత్సాహంతో ఉన్న టీమిండియా మ‌హిళ‌ల‌ ప్ర‌పంచ‌క‌ప్ కోసం రంగంలోకి దిగుతోంది. ఈ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆతిధ్య ఇంగ్లాండ్ ని వాళ్ళ సొంత గడ్డ మీద అది కూడా వాళ్ళకి అచ్చోచిన లార్డ్స్ మైదానంలో మట్టి కరిపిస్తుందా లేక ఇంగ్లాండ్ లీగ్ దశ లో మన మీద ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకుంటదా అని క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


మూడు ద‌శ‌బ్దాల క్రితం... అంటే స‌రిగ్గా 34 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పటికి ప్రపంచ క్రికెట్లో టీమిండియా చిన్న జట్టు. భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ అంతంతమాత్రం. 1983 ప్రపంచకప్ లో కపిల్‌ డెవిల్స్‌ అంచనాల్లేకుండా అడుగుపెట్టింది. ఒక్కో అడుగు ముందుకేస్తూ.. రాటుదేలిన‌ జట్లను ఓడిస్తూ అనూహ్యంగా ఫైనల్‌ చేరింది. అక్కడ మేటి జట్టు వెస్టిండీస్‌ను మట్టికరిపించి అఖండ విజ‌యానికి తెర తీసింది. ఇప్పుడు భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా అలాంటి మలుపు ముంగిటే నిలిచి ఉంది. ఈ చివ‌రి విజయం సాధిస్తే.. దేశంలో మహిళల క్రికెట్‌ భవితవ్యాన్ని మార్చే దిశగా అది గొప్ప ముందడుగ‌వుతుంది. 


ఆస్ట్రేలియాపై మొన్నటి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇన్నింగ్స్‌ చూసిన వాళ్లకు మనం చూస్తున్నది మహిళల క్రికెట్టేనా అనిపించే పరిస్థితి. మహిళల క్రికెట్‌ను చూసే దృక్పథాన్నే మార్చేసిన ఇన్నింగ్స్‌ అది. హర్మన్‌ ఇన్నింగ్స్‌ను కేవలం ఒక ఇన్నింగ్స్‌లాగా… ఆస్ట్రేలియాపై విజయాన్ని కేవలం ఒక విజయంగా చూడలేం. వీటి ప్రభావం అలాంటిలాంటిది కాదు. మహిళల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోని అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచకప్‌ మీదికి దృష్టి మళ్లించారు. ఇప్పటికే టోర్నీ చూస్తున్న వాళ్లలోనూ ఆసక్తి పెరిగింది. 


ఈ ఆదివారం జరగబోయే ప్రపంచకప్‌ ఫైనల్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మహిళల క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత భీకరమైన ఆస్ట్రేలియా జట్టును బెంబేలెత్తించే వీరోచిత బ్యాటింగ్‌ విన్యాసాలతో భారత్‌ను ఫైనల్‌ చేర్చింది హర్మన్‌ప్రీత్‌. నాడు వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా లాంటి టైటిల్‌ ఫేవరెట్లకు షాకులిచ్చి కపిల్‌ సేన ఫైనల్‌ చేరితే.. నేడు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది మిథాలీ టీమ్‌. అప్పుడు ఫైనల్లో వెస్టిండీస్‌ రూపంలో ఫేవరెట్‌ ఎదురైనట్లే.. ఇప్పుడు ఇంగ్లాండ్‌ రూపంలో బలమైన ప్రత్యర్థి ముందుంది. నాటి ఫైనల్‌ వేదిక అయిన లార్డ్స్‌లోనే ఇప్పుడు కూడా తుది పోరు జరగబోతుంది. 


ఆ చారిత్రక మైదానంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడితే.. భారతీయుల్లో భావేద్వేగం రెక్క‌లు విప్ప‌డం ఖాయం. మ‌రోసారి మ‌న టీమిండియా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాలి. వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలి. ఇప్ప‌టికే ఉరిమే ఉత్సాహంతో ఉన్న మ‌న టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: