ఆగస్ట్ 5, 2016 నుండి పాత యాహూ మెసెంజర్ మనకు కన్పించదు. 1998లో మొట్టమొదటి యాహూ మెసెంజర్ అందుబాటులోకి వచ్చింది. దాన్ని మొదటిరోజు నుండి వాడిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ASL (వయస్సు, సెక్స్, ప్రదేశం) అనేది యాహూ మెసెంజర్ వినియోగదారులకు చిరపరిచితమైన పదం. అప్పట్లో యాహూ మెసెంజర్‌లో ఒకరితో ఒకరు పర్సనల్ ఛాట్ చేసుకునే వెసులుబాటుతో  పాటు యాహూ పబ్లిక్ ఛాట్ రూముల్లో అమ్మాయిల కోసం ASL అనే ప్రశ్నని సంధించి, సంతృప్తికరమైన సమాధానం వచ్చిన వెంటనే వారితో ఛాట్ చెయ్యడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉత్సుకత చూపించే వారు. ఇప్పడు వాట్సప్, ఫేస్‌బుక్‌ల మీద ఎలా గడుపుతున్నారో అప్పట్లో యాహూ మెసెంజర్ మీద అలా రోజుల తరబడి గడిపే వారంటే ఆశ్చర్యం లేదు.

గత ఏడాది (2015) యాహూ సరికొత్త మెసెంజర్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. మెసేజింగ్ అవసరాలు పూర్తిగా మారిపోయిన నేపధ్యంలో ప్రస్తుతం సమకాలీనంగా ఉన్న వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్, Line వంటి ఇతర సర్వీసులకు పోటీగా వేగాన్నీ, నాణ్యతని అందించే విధంగా యాహూ మెసెంజర్‌ని యాహూ సంస్థ విడుదల చేసింది.  పాత యాహూ మెసెంజర్ వెర్షన్‌తో పోలిస్తే "గ్రూప్ మెసేజింగ్"  కొత్త వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త సదుపాయం. అలాగే ఫొటోల లాంటివి మిత్రులతో షేర్ చేసుకునేటప్పుడు మొట్టమొదట ఓ చిన్న థంబ్‌నెయిల్ వారికి క్షణాల్లో పంపించబడి, ఆ తర్వాత పూర్తి రిజల్యూషన్ కలిగిన ఫొటో పంపించబడడం వంటి కొన్ని వినూత్నమైన సదుపాయాలు ఈ కొత్త యాహూ మెసెంజర్లో అందుబాటులోకి వచ్చాయి.

అయినప్పటికీ పాత యాహూ మెసెంజర్‌కి ఏళ్ల తరబడి అలవాటు పడిన వారు ఇప్పటికీ దానికి అతుక్కుపోయి దాన్నే వాడుతూ కొనసాగుతున్నారు. దీనివల్ల గత ఏడాది అందుబాటులోకి తీసుకు వచ్చిన సరికొత్త యాహూ మెసెంజర్ పెద్దగా ప్రాచుర్యం  పొందలేకపోతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలతో ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సప్ దూసుకుపోతుండగా మెసేజింగ్ అప్లికేషన్లకి గురువు లాంటి యాహూ మెసెంజర్ మాత్రం తన ఉనికిని నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడవలసి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 5, 2016 నుండి పూర్తిగా పాతకాలం యాహూ మెసెంజర్‌ని నిలిపి వేయాలని యాహూ నిర్ణయించింది.

సో.. ఓ చిట్టచివరి జ్ఞాపకం కోసమో, అసలు ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సుకత కొద్దీనో మీరు పాత యాహూ మెసెంజర్‌ని రుచి చూడాలంటే ఇదే సరైన తరుణం. మరో రెండు నెలల తర్వాత అది మీకు లభించదు. ఇప్పుడే మీ కోరిక తీర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: