అవినీతిని ఏమాత్రం సహించనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. అవినీతి ఆరోపణల కారణంగానే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించానంటున్నారు. రాజయ్యేకాదు.. ఎవరినీ సహించననీ.. తన కొడుకు, కూతురు అవినీతి చేసినా.. వారికీ ఇదే పరిస్థితి అని కుండబద్దలు కొడుతున్నారు. అయితే కేసీఆర్ చెప్పే మాటలకు.. ఆచరణకూ పొంతన లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. రాజయ్య తొలగింపులో అవినీతి ఓ సాకు మాత్రమేనని.. అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్.. అన్నీ తానై అయ్యి పాలన సాగించాలనుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తోంది. మంత్రులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. అందుకోసమే.. మిగిలిన మంత్రులకు ఓ హెచ్చరికలా రాజయ్యను తొలగించారని ఆ పార్టీనేత నాగం జనార్దనరెడ్డి విమర్శించారు. రాజయ్యను అవమానకరంగా పదవి నుంచి తొలగించారని.. ఆయన ఒక వేళ మంత్రిగా తప్పు చేసి ఉంటే.. దాన్ని వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.  రాజయ్య అవినీతిపై హుటాహుటిన స్పందించానని చెప్పుకుంటున్న కేసీఆర్.. మిషన్ కాకతీయలో అవినీతికి ఏం సమాధానం చెబుతారని కమలం పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ చెరవులకు మళ్లీ జీవం పోస్తామంటూ ప్రారంభించిన కాకతీయ మిషన్‌లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చోసుకుంటోందని నాగం ఎత్తి చూపారు. ఈ పథకం అంచనాలు తయారు చేసింది ఇంజినీరింగ్‌ నిపుణులా.. లేక టీఆర్ ఎస్ నాయకులా స్పష్టం చేయాలని నాగం డిమాండ్‌ చేశారు. ఒకవేళ కార్యకర్తలకు దోచి పెట్టాలనుకుంటే.. నేరుగా చెక్కులనే పంపవచ్చని నాగం హేళన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: