Sevakudu: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  శ్రీకాంత్ - చార్మి జంటగా నటించిన సినిమా ‘సేవకుడు’. ఈ సినిమాలో కృష్ణ, మంజుల కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. పైగా ప్రతీ భారతీయుడు చూడవల్సిన సినిమా అంటూ ప్రచారం చేయడంతో ఈ సినిమా కోసం కొంత అసక్తిగా ఎదురుచూశారు. మరి సినిమాలో ఏం వుందో, ఏలా ఉందో చూద్దాం..! చిత్రకథ :   ప్రపంచ ధనవంతుల జాబితాలో  5వ స్థానంలో నిలిచిన లక్ష్మీకృష్ణ ప్రసాద్ [కృష్ణ] పుట్టిన ఊరుపై మమకారంతో విజయవాడను గోల్డెన్ సిటీగా మార్చాలనే ఆశయంతో, తన కుమార్తె మంజుల [మంజుల] వ్యతిరేకిస్తూన్నా మాతృదేశానికి తిరిగి వస్తాడు. తన తండ్రి నాజర్ కోరిక మేరకు ఐపిఎస్ గా ఎంపిక అవుతాడు సూర్యం [శ్రీకాంత్]. అయితే, అనుకోని పరిస్థితుల్లో కృష్ణ ప్రసాద్, నాజర్ లు హత్యకు గురిఅవుతారు. వీరిని చంపింది ఎవరు..., తమ తండ్రుల ఆశయమైన విజయవాడ అభివృద్ధికి మంజుల, సూర్యం ఏం చేశారు... అనేది చిత్రకథ. నటీనటుల ప్రతిభ :   శ్రీకాంత్ కు ఈ సినిమా టైటిల్స్ లో ‘ఎమోషనల్ స్టార్’ అనే బిరుదు ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో శ్రీకాంత్ చాలా ఎమోషనల్ గా చేసుకుంటూ పోయాడు. చాలా ఆవేశపడిపోతూ డైలాగులు చెప్పాడు. డాన్సులు, ఫైట్లల్లో ఫరవాలేదనిపిస్తాడు. చార్మిది ఈ సినిమాలో పెద్దగా ప్రాధన్యం లేని పాత్ర. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. తనదైన నటనతో మెప్పిస్తాడు. ‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది’, ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ డైలాగులు కృష్ణ పలకడం కొంచెం వింతగా అనిపిస్తుంది. మంజుల డైలాగులను పట్టి పట్టి పలకడం వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నాజర్, ప్రదీప్ రావత్, బ్రహ్మనందం, హేమ... నటనలో కొత్తదనం లేదు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. నేపధ్య సంగీతం బావున్నా, పాటల్లో ఒక్కటి కూడా గుర్తించుకునే విధంగా లేవు. ‘చదువు ఉంటే డబ్బు వస్తుంది కానీ, డబ్బు వుంటే చదువు రాదు’ వంటి మాటలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. దర్శకత్వం విషయానికి వస్తే ప్రజలకు సందేశం ఇవ్వాలనే కథతో ఈ సినిమా తీశాడు. కొన్ని వాస్తవ సంఘటనలు నేపథ్యంగా తీసుకున్నాడు. అయితే, అభివృద్ధి కావాలంటే దుర్మార్గులను చంపడమే మార్గంగా ఈ సినిమా సాగడం, సన్నివేశాలు సరిగ్గా పండకపోడంతో ఈ సినిమా తేలిపోయింది. ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. విశ్లేషణ :   సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు తీయాలంటే ముందుగా ఆ సమస్య లేదా నేపథ్యం మీద దర్శకుడిగా స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. తనకంటూ ఓ శైలి ఉండాలి. ఈ సినిమా చూసినప్పుడు దర్శకుడు ఈ సినిమా కోసం ప్రత్యేక కృషి చేసినట్లు కనిపించదు. ఇందులో డైలాగులేకాదు, చాలా సన్నివేశాలు గతంలో విడుదలైన సినిమాలను గుర్తుకు తెస్తాయి. శ్రీకాంత్, నాజర్, విలన్ మధ్య ఇంటర్వెల్ కు ముందు సాగే సన్నివేశం ‘పోకిరి’ సినిమాను గుర్తుకు తెస్తుంది. హేమ, బ్రహ్మనందం మధ్య హస్య సన్నివేశాలు ‘అతడు’ సినిమాను గుర్తుకు తెస్తాయి. విజయవాడను మూడు నెలలు లీజ్ కు అడగడం, అప్పుడు సాగే సన్నివేశాలు ‘ఒకేఒక్కడు’ సినిమాలోని ‘ఒక రోజు ముఖ్యమంత్రి’ని గుర్తు చేస్తాయి. ‘అపరిచితుడు’, ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఈ సినిమాను తీర్చిదిద్దాలని దర్శకుడు అనుకున్నాడు. అయితే సినిమా కోసం కసరత్తు చేయకపోవడం, దర్శకుడికి తనదైన శైలీ లేకపోవడంతో ‘పులిని చూసి నక్క వాతలు పెట్టకున్నట్లు’గా ఈ సినిమా సాగింది. చివరగా :   సమయాన్ని, ధనాన్ని వృధా చేయాలనుకుంటే ఈ సినిమా చూడండి.        
 

Sevakudu Review: Cast & Crew






More Articles on Sevakudu || Sevakudu Wallpapers || Sevakudu Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: