ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఇప్ప‌టికే కొండెక్కిన బంగారం ధరలు మ‌రింత దూసుకుపోనున్నాయ‌ట‌. ప్రస్తుతం రూ.40 వేల స్థాయిలో కదలాడుతున్న పసిడి ధరలు మరో రెండు నెలలు అంటే ఈ ఏడాది చివరినాటికి రూ.42 వేల మార్క్‌కు చేరుకోనున్నాయంటున్నారు. ఎందుకు ఇలా...అంటారా...అనేక కార‌ణాలున్నాయి లేండి. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల‌ కనిష్ఠ స్థాయికి పతనమవడం, స్టాక్ మార్కెట్లు అంతంత స్థాయిలో రిటర్నులు పంచడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వీటికి తోడు పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొనడం, సెంట్రల్ బ్యాంకులు అత్యధికంగా కొనుగోళ్లు జరుపడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటంతో బంగారం ధ‌ర మరింత పెర‌గ‌నుంద‌ట‌.


బంగారం, భూములపై పెట్టుబడులు పెట్టిన వారికి ఈక్విటీ మార్కెట్ల కంటే రిటర్నులు అధికంగా లభిస్తుండటంతో గతేడాదికాలంగా వీటివైపు మొగ్గుచూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడుగా, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేకపోవడం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలకు ఆర్థిక మాంద్యం దెబ్బ తగులబోతున్నదన్న సంకేతాలతో పలు సెంట్రల్ బ్యాంకులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా కొనుగోళ్లు జరుపడంతో రికార్డు స్థాయికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్ప‌ష్టం చేస్తున్నారు. 


బంగారం ధ‌ర ఎఫెక్ట్ ఇప్ప‌టికే కొనుగోళ్ల‌పై ప‌డింది. ధనత్రయోదశి, దీపావళి సగటు అమ్మకాల పరిమాణంతో పోల్చితే 66 శాతం దిగజారి నగల విభాగంలో రూ. 3,625గా నమోదైందని వరల్డ్‌లైన్ స్పష్టం చేసింది. దుస్తుల అమ్మకాల్లో 28 శాతం పడిపోయి రూ.1,746గా ఉన్నది. కాగా, సరుకులు, రెస్టారెంట్ల విభాగాల్లో వరుసగా 11 శాతం, 32 శాతం వృద్ధి కనిపించింది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302 కాగా, కామెక్స్‌లో 1,506 డాలర్లుగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: