ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పత్తి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి  నెట్టేశాయి. పత్తికి మద్దతు ధర ఇచ్చేందుకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల అవి మూడు రోజుల్లోనే మూత పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్తికి మద్దతు ధర లభించటం కష్టంగా మారింది. 

 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పత్తికి మద్దతు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చేందుకు జిన్నింగ్ మిల్లుల్లో అధికారులు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మద్దతు ధర లభించని పరిస్థితి నెలకొంది. జిన్నింగ్ మిల్లుల్లో తక్కువ రేటుకే రైతులు పత్తిని అమ్ముకోవాల్సి వస్తోంది.

 

ఈ సారి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పత్తి పంట ఎక్కువగా సాగు చేశారు. జిల్లాలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో పత్తి పంటను వేశారు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి కానుంది. పత్తి కొనుగోలు కోసం జిల్లాలో ఏడు సెంటర్లలోని ఇరవై పై చిలుకు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో 12 శాతం లోపు తేమగల నాణ్యమైన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తూ మద్దతు ధర చెల్లిస్తున్నారు. అయితే... రైతుల వద్ద 12 నుంచి 20 శాతం తేమగల పత్తి ఉంది. 

 

ఇక...రైతులు పత్తిని ఇంటి వద్దే ఆరబెట్టుకొని రావాలని మార్కెటింగ్ అధికారులు కోరుతున్నారు. నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచిస్తున్నారు. అయితే పత్తికి గిట్టుబాటు ధర ఇచ్చేందుకు జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు మూడు రోజుల్లోనే మూతపడ్డాయి. చండూర్...మునుగోడు, నకిరేకల్ లాంటి ప్రాంతాలలో అధిక శాతం తేమగల పత్తి కొనుగోలు కేంద్రానికి వస్తుందన్న నెపంతో ప్రారంభించిన మరుసటి రోజే కొనుగోళ్లను నిలిపివేశారు సీసీఐ నిర్వాహకులు. 12 శాతానికి పైగా తేమ ఉన్న పత్తిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.

 

మరోవైపు...పత్తి పంట వేసే సమయంలోనే వర్షాలు లేక విత్తనాలు మొలవక రైతులు నష్టపోయారు. ఆ తరువాత పత్తి పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన వర్షాల వల్ల పత్తి తడిసి నల్లగా మారిపోయింది. కూలీలు దొరకక కేజీ పత్తి తీసేందుకు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ ఏడాది పత్తికి పెట్టుబడి ఖర్చు భారీగా పెరిగింది. అందుకే పత్తికి మద్దతు ధర 6 వేల రూపాయలకు పెంచి తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని కొనాలని కోరుతున్నారు రైతులు. మొత్తానికి...ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసివేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని కోరుతున్నారు రైతులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: