ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లి ఇంటిల్లిపాదులను కంటతడి పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలను  ఉల్లి కొరత తీవ్రంగా వేధిస్తోంది. బ్లాక్ మార్కెట్ లో ఉల్లి ధర సెంచరీ కొడుతుండగా.. బహిరంగ మార్కెట్ లో అందుబాటులో లేని పరిస్థితి దాపురించింది. ఇక  ఏపీ సర్కార్ సబ్సిడీపై ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో.. రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు ప్రజలు. 

 

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉల్లిఘాటుతో బెంబేలెత్తుతున్నారు. కొనకుండానే కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి. వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో, ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. మార్కెట్ లో కిలో ఉల్లి 80 నుంచి వంద రూపాయలు పలుకుతుండడంతో సామాన్యుడు హడలిపోతున్నాడు. హైదరాబాద్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో ఉల్లి ధర వందరూపాయలు పలుకుతోంది. మొన్నటి వర్షాలకు పంట పాడైపోవడంతో ధర కొండెక్కిందని  వ్యాపారులు చెబుతున్నారు. 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉల్లిధరలు భగ్గుమంటున్నాయి.  దిగుబడి తగ్గిన కారణంగా .... .ఘాటు ఎక్కువైంది. నిజామాబాద్ జిల్లాలో బహింగ మార్కెట్లో  ఉల్లి ధర సెంచరీకి చేరువవుతుండడంతో...సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనాలంటేనే జనం జంకుతున్నారు. పెరిగిన ఉల్లి ధరలు చూసి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నల్గొండలో కేజీ ఉల్లి 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. 

 

పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు.. ఏపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే ఒక్కొక్కరికి కేజీ మాత్రమే ఇస్తుండటంతో.. కుటుంబసభ్యులంతా క్యూలైన్ కడుతున్నారు. కిలో 25 రూపాయలకు సబ్సిడీపై ఉల్లిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో....అధికారులు రైతుబజార్లతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో బహిరంగ మార్కెట్ లో ఉల్లి... రకాన్ని బట్టి 60 నుండి 90 రూపాయిల వరకు పలుకుతోంది. మరో వైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద భారీగా జనం క్యూ కడుతున్నారు. అటు సిక్కోలులో కూడా అదే పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో రైతు బజార్ మార్కెట్ల వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్‌తో జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు. 

 

గుంటూరులో సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం గంటల కొద్దీ క్యూ కడుతున్నారు.  అయితే.. ఉదయం రెండు గంటలు , మధ్యాహ్నం రెండు గంటలు మాత్రమే ఉల్లి సరఫరా  చేస్తుండటం ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తోంది. ప్రకాశం జిల్లాలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. కిలో ఉల్లి ధర 80 నుండి వంద రూపాయలు పలుకుతోంది.  ప్రభుత్వం ఉల్లిపాయలు తక్కువ ధరకు విక్రయించేందుకు చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. జిల్లాలో నాలుగు రైతు బజార్లు ద్వారా 25 రూపాయలకే ఉల్లిపాయలు విక్రయిస్తున్నా...డిమాండ్ కి తగ్గట్టుగా స్టాక్ ఉండటం లేదు. 

 

ఉల్లి విస్తారంగా పండుతున్న కర్నూలు జిల్లాలోను ధర మండిపోతుంది. ఏమాత్రం నాణ్యత లేని ఉల్లి కిలో 40 రూపాయలు ఉండగా ఓ మోస్తరుగా ఉన్న ఉల్లి 70 రూపాయలు ధర పలుకుతోంది. కడప రైతు బజారులో ఉల్లి కొనుగోలు కోసం ప్రజలు బారులుదీరారు. అనంతపురం జిల్లాలో స్టాక్ లేకపోవడంతో.... పంపిణీ కేంద్రాల వద్దకు వస్తున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: