ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రతిష్ట మ‌స‌క‌బారుతోంది.  పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మహిళా ఉద్యోగులపై వివక్షకు వ్యతిరేకంగా గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన ప్రదర్శన చేసిన తీరు ఆ సంస్థ ఇమేజ్‌ను త‌గ్గించ‌గా...తాజాగా అదే రీతిలో మ‌రో ఆందోళ‌న సాగింది.

 

లారెన్స్‌ బర్లాండ్‌, రెబెక్కా రివర్స్‌ అనే ఇద్దరు ఉద్యోగులను బలవంతంగా నిరవధిక సెలవుపై ఈ నెల తొలివారంలో గూగుల్‌ యాజమాన్యం పంపించింది. దీనిపై సంస్థ‌లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల అనంత‌రం శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. దాదాపు 200 మందికిపైగా ఉద్యోగులు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. సహేతుక కారణం లేకుండానే ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడమేంటని ప్రశ్నించారు. సెలవుపై పంపిన ఇద్దరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ సంస్థ మాది’, ‘తీసేసిన వాళ్లను వెంటనే వెనక్కి రప్పించండి’ అంటూ నినాదాలు చేశారు. ‘గత కొంతకాలంగా సంస్థలో జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని సంస్థకు వివరించాం. అలాగే, ఆఫీసు పని వేళలు, ఇతరత్రా అంశాల్లో కొన్ని సంస్కరణలు చేయాలని విజ్ఞప్తి చేశాం. మా అభ్యర్థనను యాజమాన్యం పెడచెవిన పెట్టడమే గాకుండా మా నోరు నొక్కే ప్రయత్నం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నది. యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ.. ప్రశ్నించిన వారిని సెలవు పేరుతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు’ అని సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జాక్‌ జొరాతంగ్‌ తెలిపారు. 

 

ఇదిలాఉండ‌గా గ‌త ఏడాది మీటూ ఉద్య‌మంలోనూ గూగుల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. పని ప్రదేశంలో కొంతమంది మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ ఉన్నతాధికారులకు గూగుల్ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందని  న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆధారాలతో బయటపెట్టింది. ఈ వార్తలపై ఉద్యోగులు మండిపడుతూ రోడ్డెక్కారు. భారత్ సహా పలు దేశాల్లో వందల మంది గూగుల్ ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు.  వీధుల్లోకి, బహిరంగ వేదికలపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టైమ్‌జోన్లలోనూ ఉదయం 11గంటల ప్రాంతంలో ఉద్యోగులు వాకౌట్ చేశారు. భారత్‌లో హైదరాబాద్, గుర్గావ్, ముంబైలలోని మూడు కార్యాలయాల్లోని 150 మంది వరకు ఉద్యోగులు వాకౌట్ చేశారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో భారీగా ఉద్యోగులు వాకౌట్‌లో పాల్గొనగా, లండన్ ప్రధాన కార్యాలయంలోనూ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని ఆరోపించారు. ఉద్యోగుల ప్రతినిధులను బోర్డులోకి తీసుకోవాలని, వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను డిమాండ్ చేశారు. 

 


గతంలో ఎన్నడూ ఉద్యోగుల ఆందోళనను చవిచూడని గూగుల్ యాజమాన్యం.. ఆ పరిణామాలపై వెంటనే స్పందించింది. ఉద్యోగులకు నిరసన తెలిపే హక్కు ఉందని, తాను వారి హక్కును సమర్థిస్తానని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగులు పలు నిర్మాణాత్మక సూచనలతో ముందుకువచ్చారని, వారి సూచనలను అమలు చేసేందుకు సంస్థ సిద్ధమని చెప్పారు. అయితే, తాజాగా మ‌రోమారు ఉద్యోగులు రోడ్డెక్క‌డం...అది కూడా సంస్థ విధానాల‌ కార‌ణంగా కావ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: