ఐటీలో నైపుణ్యం లేని ఉద్యోగులను తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే...మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా  ఉద్యోగులు కూడా మారాల్సిన అవసరం ఉంది. అలాంటి వారికి ఉద్యోగం గ్యారెంటీ అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా ఇండియాలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉంది.  

 

ఐటీ రంగంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంలో సంబంధిత వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందువల్లే వ్యయాలు తగ్గించుకోవటం తప్పనిసరిగా మారింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో బెంచ్‌ సిబ్బందిని, ప్రాజెక్టులు లేని విభాగాల్లో సిబ్బందిని కొనసాగించటానికి ఇష్టపడటం లేదు. ఇంక్రిమెంట్లు తగ్గించటం లేదా వాయిదా వేయటానికి కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. 


 
ఇక...మనదేశంలో ఐటీ పరిశ్రమ దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. తొంభైయ్యవ దశకంలో ప్రారంభమైన ఎన్నో కంపెనీలు భారీగా విస్తరించి స్థిరీకరణ సాధించాయి. ఒక స్థాయికి చేరిన తర్వాత మధ్యస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండే సీనియర్‌ ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందువల్ల పలు ఐటీ కంపెనీలు అలాంటి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. 

 

మరోవైపు...సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఆటోమేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ... లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వస్తున్న ఫలితంగా పలు సంస్థల్లో గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉండటం లేదు. సాంకేతికంగా వస్తున్న మార్పుల వల్ల కొత్తరకం ఉద్యోగాలు లభిస్తాయి. అదే సమయంలో పాత ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందుకే తొలగింపు అనివార్యం అవుతోంది అని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.

 

అయితే... ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేందుకు కూడా మార్గాలు ఉన్నాయి. తాము పని చేస్తున్న విభాగాల్లో నైపుణ్యాలు పెంచుకోవటమే దీనికి సరైన మార్గం అని చెబుతున్నారు. ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు సమకూర్చుకునే వారి ఉద్యోగాల కొరత లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి, సేవలకు ఎంతో గిరాకీ లభిస్తోంది. ఈ విభాగంలో మనదేశంలోనే సమీప భవిష్యత్తులో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఎన్నో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. నైపుణ్యాలు పెంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా తయారయితే ఉద్యోగాలకు  గ్యారెంటీ ఉంటుందని ఐటీ వర్గాల అభిప్రాయం. ఇదే సమయంలో తమ రంగంలో వెనుకబడిన వారిని మాత్రం 'తొలగింపు' భయం వెంటాడుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా నిపుణులను సన్నద్ధం చేసేందుకు విద్యా సంస్థలు, ఐటీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తానికి...వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుండటం ఐటీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: