దేశ విమానయానాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఎయిరిండియా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఈ సంస్థ నిర్వహణ తలకు మించినా భారంగా మారడంతో.. దీనిని అమ్మేయాలని కొద్దికాలంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అది వీలు కాకుంటే ఆరునెలల్లో షట్ డౌన్ చేయాలని నిర్ణయించింది. ఇంతకూ ఈ పరిస్థితి ఎయిరిండియాకు ఎందుకొచ్చిందో తెలుసా.. ?

 

ఎయిరిండియా.. దశాబ్దాల తరబడి భారత వాయురవాణాలో కింగ్‌లా వెలిగిపోయింది. దీన్ని గగనతల మహరాజు అని ముద్దుగా పిలుస్తారు. 1932లో జేఆర్డీ టాటా సింగిల్ ఇంజిన్‌తో నడిచే విమానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కరాచీ-ముంబై మెయిల్ కారియర్ గా పనిచేసింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత దీన్ని ఎయిరిండియాగా పేరు మార్చారు. 1960 ఫిబ్రవరి 21 నుంచి బోయింగ్ 707 సర్వీసులు ప్రారంభించింది. ఎయిర్ బస్, బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లకు తోడుగా 94 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఇండియాలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్ గా ఉన్న ఎయిరిండియా.. 18.6 శాతం వాటా కలిగి ఉంది. 2014 జులై 11 నుంచి స్టార్ అలయెన్స్‌లో 27వ మెంబర్‌గా చేరింది. 

 

ప్రస్తుతం ఈ మహరాజు.. ఆర్థికంగా దివాళా తీశాడు. 60 వేల కోట్ల రూపాయల నష్టాలతో నడవడమే కష్టంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వం డిజిన్వెస్ట్ మెంట్ ప్రారంభించడంతో .. దీని సమస్య మరింత జఠిలమైంది. ఇంక దీన్ని నిర్వహించలేమని ఓ నిర్థారణకు వచ్చిన ప్రభుత్వం.. ఎవరైనా ముందుకు వస్తే పూర్తిగా వదిలించుకుందామని ప్రయత్నిస్తోంది. అయితే ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. 6 నెలలు మాత్రమే దీన్ని నడపగలమని.. ఆ తర్వాత బలవంతంగా షట్‌ డౌన్ చేయాల్సిందేనంటున్నారు అధికారులు. దీన్ని కొనేందుకు ఎవరు ముందుకు రాకపోతే జెట్ ఎయిర్ వేస్ పద్ధతిని అనుసరించాల్సిందేనంటున్నారు.

 

2011-12 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ 30, 521 కోట్ల రూపాయల నిధులను.. ఈ సంస్థలోకి పంపినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. బయట నుంచి నిధులు తెచ్చుకునేందుకు గానూ 2,400 కోట్ల రూపాయల మేర గ్యారంటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరితే.. కేవలం 500 కోట్ల రూపాయలకు మాత్రమే గ్యారంటీ ఇస్తోందని ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు.


గతేడాదితో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ సైతం ఆరోగ్యకరంగా లేదని అధికారులు చెబుతున్నారు. గతేడాది 18.60 శాతం వృద్ధిరేటు ఉండగా.. ఈ ఏడు 3.86శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. ఎయిరిండియా డిజిన్వెస్ట్ మెంట్ కోసం సింగపూర్ టు లండన్ రోడ్ షో.. కూడా .. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏడు నుంచి ఎనిమిది ప్లేన్‌లు ఇంజిన్ సమస్యలు ఉన్నాయని.. ఒకటి మాత్రం ఎగిరేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో  ఎయిర్ ఇండియా ప్రస్థానం ఇంకో ఆరు నెలల్లో ముగిసి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: