పసిడి ధరలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఒకేసారి భారీగా పెరగడం, తగ్గితే కూడా భారీగా పడిపోవడం రివాజుగా మారింది.  ఇటీవల మూడు రోజుల్లో మూడు వేలు తగ్గి వినియోగదారులకు ఆశ కల్పించిన బంగారం మళ్లీ పైకి ఎగబాకింది. పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే 700 రూపాయలు పెరిగింది.

 

కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న క్రమంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. అంతర్జాతీయగా బంగారం ధరలు పెరగడంతో.. దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైలో పది గ్రాముల బంగారం ఏకంగా 700 రూపాయలు పెరిగింది. 

 

డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరగడానికి  కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనించాయి. ముంబైలో కిలో వెండి 338 రూపాయలు పెరిగింది. కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మహమ్మారి కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న క్రమంలో..  ఫెడ్‌ వడ్డీరేట్లలో కోత విధించడం పసిడికి కలిసివచ్చింది. 

 

భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్  పది గ్రాముల బంగారం ధర ఏకంగా 700 రూపాయలు పెరిగి 41 వేలు దాటింది. ఇటీవలి కాలంలో 44 వేల రూపాయలకు చేరిన పసిడి ధర.. కరోనా భయం, మార్కెట్ల పతనంతో 40 వేలకు తగ్గింది. ఇక ఇదే సమయంలో వెండి ధర కిలోకు 338 రూపాయలు  పెరిగి 40 వేల 825 రూపాయలకు చేరింది. ఫెడ్ నిర్ణయం ప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉండటంతో, బంగారం ధర ఇంకా పెరగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

బులియన్‌ మార్కెట్‌ కళ తప్పుతోంది. మార్కెట్‌ నీరసించడంతో పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8.86 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 2,962 కోట్ల డాలర్లు ఉన్న పసిడి దిగుమతులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 2,700 కోట్ల డాలర్లకు దిగొచ్చాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 17,300 కోట్ల డాలర్ల నుంచి 14,312 కోట్ల డాలర్లకు తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: