పారుతున్న సెలయేటిలో పాత నీరు స్థానంలో కొత్త నీరు చేరుతున్నట్లుగానే.. స్వయంకృషితో రాణిస్తున్న యువ ఔత్సాహికుల ధాటికి నిన్నటి తరం వ్యాపార సామ్రాజ్యాలు కనుమరుగవుతున్నాయి. చేజేతులా చేసిన తప్పులు కొన్నైతే.. మారుతున్న పరిస్థితులతో పునాదులు కదులుతున్నవి మరికొన్ని. ఈ క్రమంలో కొత్త శ్రీమంతుల రాక.. పాత సంపన్నుల పోక.. రెండు పరిణామాలనూ ఒకేసారి నేడు దేశం చవిచూడాల్సి వస్తోంది. టాటా, బిర్లా, అంబానీ, అదానీల వంటి వ్యాపార సామ్రాజ్యాల చరిత్ర లేకున్నా..కొత్త వ్యాపార‌వేత్త‌లు తెర‌పైకి వ‌స్తున్నారు, త‌మ రంగంలో రాణిస్తున్నారు.

వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించలేక సంస్థలు దివాలా తీస్తుంటే.. వాటి అధినేతల సంపద కరిగిపోతోంది. ఫలితంగా భారతీయ కుబేరుల్లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన పేర్లు.. ఇప్పుడు కదిలిపోతున్నాయి. వ్యాపార విస్తరణ పేరుతో వేసిన తప్పటడుగులు.. ఆయా శ్రీమంతుల వైభవాన్నే హరించేస్తున్నాయి. అనిల్ అంబానీ సంపద 2008లో 31 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఇప్పుడు 128 మిలియన్ డాలర్లకు దిగజారింది. అలాగే శశి రుయా, రవి రుయాల ఆస్తులు 18 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సుజ్లాన్ ఎనర్జీ అధినేత తుల్సీ తంతి సంపదా కరిగిపోయింది.


ఇదే స‌మ‌యంలో, నూతన ఆలోచనలతో.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ బిలియనీర్లుగా ఎదుగుతున్న భారత యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఫ్లిప్‌కార్ట్ సృష్టికర్తలు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్.. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. బిజు కే-12 ఎడ్యుకేషన్ యాప్ అధినేత బిజు రవీంద్రన్.. ఇలా ఎందరో కొత్తవారు దేశ సంపన్నుల జాబితాలో నేడు కనిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: