బిర్లా గ్రూపు మూలపురుషుడైన బసంత్ కుమార్ బిర్లా(బీకే బిర్లా) తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. దేశీయ పారిశ్రామికవర్గానికి వన్నె తెచ్చిన బిర్లా..వయస్సు సంబంధిత సమస్యలతో మరణించినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.  1921లో ఘనశ్యామ్ బిర్లా దంపతులకు జన్మించిన బీకే బిర్లా.. 15ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కేసోరామ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో కాటన్, పాలిస్టర్, నైలాన్, కాగితం, షిప్పింగ్ సహా సిమెంట్ టీ, కాఫీ ఉత్పత్తుల వంటి రంగాలలో రాణించారు. భారత పారిశ్రామిక రంగానికి ఆధ్యుడిగా పేర్కొనే బీకే బిర్లా.. ఆ రంగంలో ఎన్నో విశేషమైన సేవలందించారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా.. బీకే బిర్లా పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు.


బీకే బిర్లాకు ఇద్దరు కుమార్తెలు, ఒక్కరు కుమారుడు. ఆయన కుమారుడు ఆదిత్యా విక్రమ్ బిర్లా 1995లోనే మరణించగా, ఆయన భార్య సరళ బిర్లా కూడా 2015లోనే పరమపదించారు. బిర్లా కుమార్తెల్లో మంజుశ్రీ ఖైతాన్, జయశ్రీ మోహతాలు కేశోరామ్ ఇండస్ట్రీస్, జయశ్రీ టీ అండ్ ఇండస్ట్రీలు వ్యాపార విభాగాలను చూసుకుంటున్నారు. గురువారం కోల్‌కతాలోని బిర్లా పార్క్‌లో బిర్లా దహన సంస్కారాలు జరుగనున్నాయి. బీకే బిర్లా పార్థివదేహాన్ని ఆయన మనుమడు కుమార మంగళం బిర్లా నివాళులర్పించారు. బిర్లా మృతితో ముంబైలో ఉన్న బిర్లా బిల్డింగ్‌ను గురువారం మూసివేసివుంచనున్నారు. చిన్నతనంలోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టిన బీకే బిర్లా అంచెలంచెలుగా ఎదుగుతూ కేశోరామ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు.


తెలంగాణ రాష్ట్రంతో బీకే బిర్లాకు అవినాభావ సంబంధం ఉంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఆయన పేరుతో ఏర్పాటైన బసంత్‌కుమార్ గ్రామంలో 1960లోనే రాష్ట్రంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి సున్నపురాయి నిక్షేపాలతోపాటు, సింగరేణి బొగ్గును కేంద్రంగా చేసుకొని, కేశోరాం సిమెంటు కర్మాగారంతోపాటు, కేశోరాం థర్మల్ కేంద్రాన్ని ఆయన నెలకొల్పారు. ఆయన తండ్రి గన్‌శ్యాందాస్ (జీడీ) బిర్లా పేరిట జీడీనగర్, బసంత్‌కుమార్ బిర్లా పేరిట బసంత్‌నగర్ గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో బసంత్‌నగర్‌లో విషాదం నెలకొంది. కార్మికులు బాపూజీగా పిలుచుకునే అధినేత మృతిచెందడంపై కర్మాగారం అధికారులు, కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు, రిటైర్డు కార్మికులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: