డీజేలోని ఓ పాట వివాదాల్లో ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. గుడిలో బ‌డిలో మ‌డిలో అన్న పాట‌పై బ్రాహ్మ‌ణ సంఘాలు అభ్యంత‌రం తెలిపాయి. అగ్ర‌హారం – త‌మ‌ల‌పాకు అంటూ కొన్ని ప‌దాలు వాడ‌డంపై బ్రాహ్మ‌ణులు విరుచుకుప‌డ్డారు. దీనిపై ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా వివ‌ర‌ణ ఇచ్చాడు. ‘నేనూ ఓ బ్రాహ్మ‌ణుడినే.


నా వ‌ర్గాన్ని నేనేందుకు కించ‌ప‌ర‌చుకొంటా’ అని చెప్పుకొన్నా ఎవ్వ‌రూ శాంతించ‌లేదు. సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కూ ఈ వివాదాన్ని పెంచి పోషించ‌డం ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లో, లేదంటే లేని పోని త‌ల‌నొప్పులు ఎందుకు అనుకొన్నాడో.. దిల్‌రాజు దిగివ‌చ్చి డీజే వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది.


ఈరోజు డీజే ట్రైల‌ర్‌ని బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. సాధార‌ణంగా… ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ల‌కు దూరంగా ఉండే బ‌న్నీ.. ‘డీజే’కి మాత్రం ప్రెస్ మీట్ పెడుతున్నాడు. దీని వెనుక ఉన్న ఉద్దేశం వివాదాల‌కు పుల్ స్టాప్ పెట్ట‌డ‌మే అని తెలుస్తోంది. ఈ ఫంక్ష‌న్‌కి దిల్‌రాజు బ్రాహ్మ‌ణ సంఘాల వాళ్ల‌నీ ఆహ్వానించాడ‌ట‌. అక్క‌డ‌.. డీజే వివాదంపై ఓ క్లారిటీకి వ‌చ్చే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.


రెండ్రోజుల క్రితం ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా బ్రాహ్మ‌ణ సంఘాల‌తో మాట్లాడాడ‌ట‌. వాళ్ల అభ్యంత‌రం చెప్పిన కొన్ని ప‌దాల‌ను పాట నుంచి తొల‌గించ‌డానికి హ‌రీష్ శంక‌ర్ అంగీక‌రించాడ‌ని తెలుస్తోంది. డీజే ట్రైల‌ర్ ఫంక్ష‌న్‌లోనే ఈ వివాదానికి శుభం కార్డు వేయాల‌నుకొంటున్నార‌ని, ఇదే వేదిక‌పై ‘ఎవ‌రైనా హ‌ర్ట్ అయితే క్ష‌మించండి’ అనే డైలాగులూ వినిపించ‌నున్నాయ‌ని తెలుస్తోంది. సో.. డీజే ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ కి ఈ ర‌కంగా ఓ ప్రాధాన్యం ఏర్ప‌డిన‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: