రాజ‌కీయాల్లో  అధికార పార్టీపై బుర‌ద జ‌ల్లేందుకు ఎప్పుడూ.. ప్ర‌తిప‌క్షాలు రెడీగానే ఉంటాయి. ఇక‌, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఎప్పుడూ వెసులుబాటే! కానీ, అదేం చిత్ర‌మో కానీ.. ఏపీలో మాత్రం ప‌రిస్థితులు డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. రావాలి జ‌గ‌న్‌.. కావాలి జ‌గ‌న్‌.. అన్న‌వారే.. ఆయ‌న కోసం అల‌మ‌టించిన వారే.. ఇప్పుడు జ‌గ‌న్ చుట్టూ జ‌గ‌డం సృష్టిస్తున్నారు. జ‌గ‌న్ వీక్ అయ్యేలా చేస్తున్నారు! ఇదీ.. ఇప్పుడు వైఎస్సార్ సీపీలో చెవిలో చిన్న‌మాట అంటూ.. నేత‌లు చ‌ర్చించుకుంటున్న విష‌యం. ఉద్దేశ పూర్వకంగా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నారా?  లేక‌.. తెలియ‌క చేస్తున్నారా? అనే విష‌యాలు తెలియ‌క పార్టీ నేత‌లు, సీనియ‌ర్లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. 


తాజాగా జ‌రిగిన ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే.. `జ‌గ‌న్‌ను ఎంతో అభిమానిస్తున్నాను.. జ‌గ‌న్ ఆయ‌న తండ్రి వైఎస్‌ను మించిన ప‌రిజ్ఞానం ఉన్న నాయ‌కుడు..` అని వేనోళ్ల కీర్తించిన వారే  పుల్ల‌లు పెడుతున్నారు. నిన్న‌మొన్న‌టి వర‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం పార్టీలో త‌ల‌నొప్పిగా మారింది. దీనిపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ర‌ఘు కోలుకోలేని విధంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పోనీలే.. ఇక‌, వైఎస్సార్ సీపీని ఇబ్బంది పెట్టే `స్వ‌ప‌క్షం` లేద‌ని అంద‌రూ అనుకున్నారు. పార్టీ నాయ‌కులైతే.. `హ‌మ్మ‌య్య త‌ల‌నొప్పి వ‌దిలింది!` అనుకున్నారు. అయితే, వారు అలా అనుకున్నారో.. లేదో.. ఇలా మ‌రో రూపంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే వ్య‌క్తులు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చారు.


ఆయ‌నే తిరుమ‌ల శ్రీవారి మాజీ ప్ర‌ధానార్చ‌కుడు ర‌మ‌ణ‌దీక్షితులు. తాజాగా ఈయ‌న వ్య‌వ‌హారం ఇటు పార్టీని, అటు ప్ర‌భుత్వాధినేత‌ను కూడా ఇరుకున పెట్టేలా మారింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ర‌మ‌ణ‌దీక్షితులు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు.. రాష్ట్రంలో కాబోయే సీఎం జ‌గ‌నేన‌ని  దీక్షితులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకుగాను తాను స్వ‌యంగా యాగాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మిరాశీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. అర్చ‌క ప‌ద‌వి నుంచి  దీక్షితులుకు విశ్రాంతినిచ్చింది. అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ ఆయ‌న కోస‌మే కాకుండా యావ‌త్ పురోహితులు కోరుకుంటున్న విధంగా మిరాశీ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. 

 

వంశ‌పారంప‌ర్య పురోహిత వ్య‌వ‌స్థ‌కు తిరిగి జీవంపోశారు. అంతేకాదు, పురోహితుల‌కు గ‌తంలో లేని విధంగా వేత‌న వ్వ‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. మ‌రి ఇంత‌గా తాను అనుకుంటున్న‌, గ‌తంలో తాను డిమాండ్ చేసిన కార్య‌క్ర‌మాలు అన్నింటినీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా ఒక్కొక్క‌టీ చేసుకుంటూ వ‌స్తున్నా.. ఎక్క‌డో ర‌మ‌ణ‌దీక్షితులు మాత్రం అసంతృప్తిగా ఫీల‌వుతున్నారో.. ఏమో.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా తిరుమ‌ల‌లో అర్చ‌న చేసే అర్చ‌క స్వాముల్లో 15 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, తాము శ్రీవారి ద‌ర్శ‌నాల‌ను పూర్తిగా నిలిపివేయాల‌ని కోరుతున్నా.. అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇలానే వ‌దిలేస్తే.. తిరుమ‌ల భ్ర‌ష్టుప‌ట్టి పోతుంద‌ని ర‌మ‌ణ దీక్షితులు త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

 

అంత‌టితో ఆయ‌న ఆగ‌కుండా సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంలో మౌనం పాటించ‌డం స‌రికాద‌న్నారు. వాస్త‌వానికి ఇవ‌న్నీ అంత‌ర్గ‌త విష‌యాలు. ఏదైనా ఉంటే.. అధికారుల‌కు లేదా సీఎంవోకు ర‌హ‌స్యంగా స‌మాచారం పంపించే వ్య‌వ‌స్థ ఉంది. దీనికంటే ముందు టీటీడీ ఈవోకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. కానీ.. ఈ ఛాన‌ల్స్‌ను వ‌దిలేసి.. ర‌మ‌దీక్షితులు రోడ్డెక్కారు. దీంతో ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాలుగా మారాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై పీక‌ల‌దాకా అక్క‌సున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు, వాటి అనుకూల మీడియాల‌కు ర‌మ‌ణ దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లు అందివ‌చ్చిన వ‌రంగా మారాయి. వాటికి మ‌రింత‌గా మ‌సాలా కూరి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల బాణాలు సంధించేందుకు రెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే వైఎస్సార్ సీపీ నేత‌లు.. ``మావోడు.. మావోడు.. అంటూనే.. ఇలా చేస్తున్నారేంట‌య్యా.. జ‌గ‌న్ చుట్టూ ఈ జ‌గ‌డాలేంట‌య్యా?`` అంటూ.. చెవిలో చిన్న‌గా చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు కూడా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో చెక్ పెడ‌తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: