దేశంలో ఎక్కడి వారు అక్కడే ' లాక్ ' అయిపోయారు. ఎటూ వెళ్లేందుకు అవకాశం లేకుండా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దీనిని అదుపులోకి తెచ్చేందుకు గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ నిబంధన అమల్లోకి తెచ్చారు. ఏప్రిల్ 14వ తేదీతో ఈ నిబంధన ముగియడంతో ఇక స్వేచ్చగా రోడ్లపైకి తిరగవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో మే ౦౩ వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగింపు ఒకటే మార్గం గా వివిధ రాష్ట్రాల సీఎం లు కూడా ప్రధానికి సూచించడంతో ప్రధాని మే 03 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు లాక్ డౌన్ లో నిబంధనల సడలింపులు ఉంటాయని ఆశగా ఎదురుచూసిన ప్రజల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఏపీలో పెరిగిపోతోంది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

IHG

ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ నిబంధన కారణంగా ప్రజలు, వలస, దినసరి కూలీల బాధలు వర్ణనాతీతం. వీరంతా ఇప్పటివరకు లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేస్తారనే ఆశతో ఉండిపోయారు. తాజాగా మహారాష్ట్రలోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద సొంత ఊళ్లకు వెళ్లేందుకు వేలాది మంది వలస కూలీలు వచ్చి చేరడం, ఆందోళన చెయ్యడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంఘటనపై ఆరా తీసింది. మహారాష్ట్ర తరహాలో మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి తలెత్తితే అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్ర లో చెలరేగిన ఆందోళన తరహాలో మిగతా చోట్ల కూడా ఆందోళన చెలరేగితే పరిస్థితి ఏంటి అనేది అందరిలోనూ సందేహాన్ని కలిగించింది. 

 

IHG


బాంద్రాలో ఆందోళన చేసిన వలస కూలీల్లో ఎక్కువమంది బీహార్, ఉత్తర ప్రదేశ్ తో పాటు, దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నారు. వారంతా అప్పటి నుంచి చేసేందుకు పని లేక, చేతిలో డబ్బులు లేక సతమతమవుతున్నారు. కేవలం  స్వచ్ఛంద  సంస్థలు ఇచ్చే భోజనం పొట్లాల మీద ఆధారపడి వీరిలో చాలా మంది బతుకుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉండే కంటే, తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతే ఏదో రకంగా బతకవచ్చనే ఆశతో వీరంతా బాంద్రా వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమస్య కేవలం బాంద్రా లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఎక్కడి వారక్కడ లాక్ డౌన్  కారణంగా ఇరుక్కుపోయారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేక సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు తప్పు మీది అంటే తప్పు మీది అంటూ విమర్శలు చేసుకుంటున్నారు. 

 

IHG
వలస కూలీలకు  కేంద్రం భరోసా ఇవ్వలేదని రాష్ట్రాలు, రాష్ట్రాలదే బాధ్యత తమకేమి సంబంధం లేదు అని  కేంద్రం, ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీ నుంచి కొన్ని సడలింపు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20వ తేదీన కేంద్రం కొన్ని మినహాయింపులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే మే 3 తర్వాత లాక్ డౌన్ ను  మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 

IHG


ఇప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దాదాపు అన్ని రాష్ట్రాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరికొంతకాలం పొడిగిస్తే ప్రభుత్వాలతో పాటు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మన దేశ జనాభాలో మూడు వంతుల మంది రెక్కాడితే గాని డొక్కాడని వారే ఉన్నారు. సుదీర్ఘకాలం వీరందరిని ప్రభుత్వాలు పోషించాలన్నా అది జరిగే పని కాదు. అలా అని నిబంధనలు పూర్తిగా సడలిస్తే వైరస్ వ్యాధి మరింత ఉధృతమై మొదటికే మోసం వస్తుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన  పరిస్థితి ఉంది. ఈ విషయంలో కేంద్రం వేసే అడుగులు కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి గనుక అన్ని విషయాల పైన పూర్తిస్థాయిలో లోతుగా పరిశీలించి, అప్పుడు నిర్ణయం తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. లేకపోతే అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: