మనిషికి మొండితనం, మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు..కొంచం ముందుచూపు కూడా ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఇది ఎక్కడా కనిపించట్లేదు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి జగన్ చూపు మొత్తం పాలన మీదనే ఉంది. దానికంటూ కారణం లేకపోలేదు...ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నీ తొందరగా నెరవేర్చి ప్రజల హృదయాల్లో మంచి నాయకుడిగా ముద్ర వేయించుకోవాలన్నది ఆయన కోరిక. అందులో ఏ మాత్రం తప్పులేదు. అయితే ప్రజాపాలన మీద పెట్టినంత దృష్టి సీఎం జగన్ పార్టీ మీద పెట్టట్లేదు అనేది మాత్రం అక్షర సత్యం. దీంతో పార్టీలోని వారంతా డైలమాలో పడ్డారు. అసలు ఇది తమ పార్టీ ప్రభుత్వమేనా అని కొందరు తలల బద్దలుకొట్టుకుంటున్నారు.

 

జగన్ ని లెజిస్లేచర్ నాయకుడిగా ఎన్నుకోవడానికి నాడు మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మళ్ళీ ఆ తరువాత వారికి జగన్ దర్శనం లేకుండా పోయింది. ఇక పార్లమెంట్ మీటింగులు ఉన్నపుడు ఎంపీలతో జగన్ మీట్ అవుతున్నారు. లేకపోతే అదీ లేదు. మరో వైపు చూసుకుంటే మంత్రి వర్గ సమావేశం చివరి సారిగా మార్చి 26న జరిగింది. ఇవన్నీ చూస్తే అర్ధం కావట్లేదా సీఎం జగన్ పార్టీకి, ప్రజా ప్రతినిధులకు ఎంతగ దూరంగా వెళ్తున్నారో. అసలు పార్టీ సర్వసభ్య సమావేశంగా చెప్పుకునే వైసీపీ ప్లీనరీ 2017 తరువాత నుంచి ఇప్పటివరకు జరగలేదు. అప్పుడు జరిగిన  ప్లీనరీలో జగన్ పాదయాత్ర అజెండా ఖరారు చేశారు. దాని తరువాత జగన్ పాదయాత్ర ఏడాదిన్నర పాటు చేయడం ఆ వెంటనే సీఎం అయిపోవడం జరిగిపోయాయి. అయినా ఇప్పటివరకు దాని ఊసే లేదు. అలాగే పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ అని ఒకటి ఉంటుంది. కానీ, దాని సమావేశం ఇప్పటివరకు జరగలేదు. ఇక పార్టీ క్యాడర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాడర్ మొత్తం నైరాశ్యంలో నిండిపోయింది. ప్రజాపాలనా ఎంత చేస్తేనేం... 2024 నాటికి జనం వద్దకు వెళ్ళి పధకాలు చెప్పి ఓట్లు అడగడానికి పార్టీ సవ్య దిశలో ఉండాలిగా. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు, నాయకులు ఉండాలిగా. సీఎం జగన్ ఇవన్నీ పట్టించుకుంటేనే పట్టు నిలుస్తుంది. లేదంటే పార్టీ పట్టాలెక్కడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: