వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటింది. అయితే ఆయన ఏడాది పాలనపై భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలేమో ఆయనది రాజన్న రాజ్యం అంటున్నారు. ప్రతిపక్ష నేతలేమో ఆయనది రాక్షస రాజ్యం అంటున్నారు. అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది కాలంలో చేసిందేటి..?ఆయన చేసిన అభివృద్ధి ఏంటి..? ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలు ఏంటి..? ఇలాంటి విషయాలపై ఆత్మపరిశీలన చేసుకుందాం....

 

అధికారం చేపట్టిన నాటి నుంచి తాను హామీ ఇచ్చిన నవరత్న పధకాలను మెరుపు వేగంతో అమలు చెయ్యడం ప్రారంభించారు సీఎం జగన్. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం ద్వారా సుమారు నాలుగు లక్షలమంది చదువుకున్న నిరుద్యోగులకు శాశ్వత ఉపాధి దొరకడమే కాక ప్రజాసేవలు మెరుగయ్యాయి.  ప్రభుత్వ పధకాలను ఇంటింటికీ అందించడంలో ఈ వాలంటీర్ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచింది. ఇక రైతుబంధు పధకం, పింఛన్ పెంపుదల, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఏడాదికి ఇరవై వేలు ఇవ్వడం, ఆటో, టాక్సీలు నడుపుకుని జీవించేవారికి పదివేలు రొక్కం ఇవ్వడం, దర్జీపనివారు, అర్చకులు, పాస్టర్లు, ముల్లాలు ఇలా ఒకటేమిటి…జగన్ అమలు చేసిన పథకాల్లో లబ్ది పొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి లేదు.  ఇక విద్యాసంస్కరణల్లో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పేద కుటుంబాలవారికి ఒక వరం అని చెప్పుకోవచ్చు.  ఆరోగ్యశ్రీ పధకం కింద సుమారు రెండువేల రకాల వ్యాధులను చేర్చడం. అలాగే నలభై 43 వేళ బెల్ట్ షాపులను తొలగించడం, మద్యం దుకాణాలను తగ్గించడం, మద్యనిషేధం వైపుగా అడుగులు వేస్తుండటం ఆయన పాలనకు ప్రతిరూపం.

 

అయితే నాణేనికి రెండో వైపు కూడా చెప్పుకోవాలి.. సీఎం జగన్ తొలి ఏడాది పాలనలో కొన్ని మరకలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి జగన్ ప్రభుత్వానికి అనేకమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి.  జగన్ ప్రభుత్వం జారీ చేసిన అరవైనాలుగు జీవోలను హైకోర్టు కొట్టేసిందంటే అది చాలా తీవ్రమైన విషయంగా చెప్పుకోవాలి. ఒకటి రెండు కొట్టేస్తే అది వేరు. కానీ, 64  జీవోలను కొట్టేయడం అంటే ఒక ప్రజాప్రభుత్వానికి అత్యంత అవమానకరమైన విషయంగా భావించాలి. ఎంత బలం ఉన్నప్పటికీ, రాజధాని తరలింపు,  హైకోర్టు తరలింపు,  ఆంగ్లమీడియం, ప్రభుత్వ  కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వెయ్యడం లాంటి అంశాలు జగన్ కు పెద్ద దెబ్బగా చెప్పుకోక తప్పదు. ఇలాగే మరికొంతకాలం ప్రభుత్వ నిర్ణయాలను కోర్ట్ తప్పు పడుతుంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది.  మొన్న డాక్టర్ సుధాకర్ విషయంలో “ప్రభుత్వాన్ని మేము నమ్మం”  అని హైకోర్టు చేసిన వ్యాఖ్య అత్యంత తీవ్రమైనది. లోపం ఎక్కడుంది?  ఎవరిలో ఉంది?  నియమించుకున్న, నమ్మిన న్యాయసలహాదారుల్లో ఉందా.. లేక అధికారుల్లో ఉందా... అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు ఉంటె దిద్దుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: