కొంతమంది తెలివి తేటలు చూస్తే ముచ్చటేస్తుంది.అసలు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు అనే సందేహం కూడా కలుగుతుంది. ఇక మేధావులకే మేధావి, మీడియా మొఘల్ రామోజీ సంగతి అయితే చెప్పనవసరం లేదు. పొదుపు చర్యలు తీసుకోవడం లో ఆయనకు ఆయనే సాటి అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. ఏ రంగంలో అయినా లాభాలు తప్ప నష్టాలు రాకుండా చూసుకోవడం, ప్రతి పనిలోనూ విశిష్టత చూపించడం, ఇలా అన్నిటిలోనూ రామోజీ బాగా ఆరితేరిపోయారు. ఇక ఆయన మీడియా అంటే ఈనాడు గురించి చెప్పుకోవాలంటే పెద్ద చరిత్రే. దినపత్రికల్లో రారాజుగా వెలుగొందుతూ వచ్చింది. ఈనాడు లో ఒక వార్త వచ్చింది అంటే అది అక్షర సత్యం, ప్రభుత్వ శాసనం అన్నట్టుగా ఉండేది. జనాలు అలాగే నమ్మే వారు, ప్రభుత్వాలు అలాగే భయపడేవి.


ఎప్పుడయితే సోషల్ మీడియా విజృంభించిందో అప్పుడే పత్రికల మనుగడ ప్రశ్నర్ధకంగా మారిపోయింది. దీనికి తోడు ఇప్పుడు కరోనా ప్రభావం వెరసి మొత్తం ప్రింట్ మీడియా భవిష్యత్తే ప్రాణార్ధకం అయ్యింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈనాడు లో ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ఉన్నపళంగా ఉద్యోగాలు తీసేసి బయటకి వెళ్ళమంటే జరిగే రాద్ధాంతం ఈనాడుకు తెలియంది కాదు. అసలే ఇటువంటి వ్యవహారాలపై ఈనాడు ఎన్నో కథనాలు ప్రచురించి ఉంటుంది. అందుకు ఆ ఈనాడు అధిపతి రామోజీ తన మేధస్సుకి పదును పెట్టి, ఉద్యోగులను పొమ్మనలేక పొగ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తున్నారు. 

 


లే ఆఫ్ అంటూ ఎప్పుడూ, ఎక్కడా వినని ఓ చట్టాన్ని తన మేథస్సు ఉపయోగించి బయటకి తీసాడు రామోజీ. ఉన్నపళంగా ఉద్యోగులను పీకేస్తే లేబర్ లా అడ్డం పడడమే కాకుండా, అనవసర తలనొప్పులు రావడంతో పాటు, ఉన్న పేరు కూడా పోతుందనే బాగా ఆలోచించి అనేక సెక్షన్ల ను బయటకు తీసి ఓ వింత లే ఆఫ్ ను ఈనాడు ఉద్యోగుల ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం ఎడిటోరియల్ విభాగానికే పరిమితం చేయకుండా, ప్రింటింగ్,  సర్కులేషన్, మార్కెటింగ్ ఇలా అన్ని విభాగాలను ఆ పరిధిలోకి వర్తింపజేశారు. ఈ లే ఆఫ్ ప్రకారం ఏ ఉద్యోగితో ఎన్ని రోజులు పని అవసరం ఉంటుందో లెక్క కట్టి, దాని ప్రకారం షెడ్యూల్ చేస్తారు. అన్ని రోజులకు మాత్రమే ఉద్యోగులతో పని చేయించుకుని వేతనాలు చెల్లిస్తారు. అంటే ఉద్యోగులందరికీ సమాన పని ఏమీ ఉండదు. ఈ కొత్త లే ఆఫ్ పూర్తిగా లేబర్ నిబంధనల ప్రకారం అని ఈనాడు చెబుతోంది. 

ఇప్పుడు ఈనాడులో విధించిన ఈ కొత్త లే ఆఫ్ నిబంధనలపై గట్టిగా నోరు తెరిచి అడిగే సాహసం ఏ ఒక్కరు చేయలేదు.. చేయలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఈనాడు అందులోనూ అన్ని విభాగాల్లోనూ తలపండిన ప్రపంచ మేధావి రామోజీ. ప్రస్తుతం కరోనా కారణంగా రామోజీ గ్రూప్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. హోటళ్లు, స్టూడియోలు, పచ్చళ్ళ వ్యాపారం ఇలా అన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయట. కేవలం ఒక చిట్ ఫండ్ కంపెనీ తప్ప ఆదాయం వచ్చే అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఈ విధంగా రామోజీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈనాడులో పేజీలు తగ్గించడం, అనేక మాసపత్రికలను మూసి వేయడం జరిగింది. అలాగే ఈనాడు జర్నలిజం స్కూలు కూడా మూసివేశారు. ఇక వేరే వాళ్లకు పత్రిక ప్రింటింగ్ అవుట్సోర్సింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఉద్యోగులతో పెద్దగా పని ఉండదు కాబట్టి ఈ లే ఆఫ్ ను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: