తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ రోజురోజుకు ఉధృత‌మ‌వుతోంది. డేంజ‌ర్ బెల్స్ మోగిస్తూ వంద‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ప‌ల్లె ప‌ట్నం తేడా లేకుండా క‌రోనా వ్యాప్తి జ‌రుగుతోంది. వాస్త‌వానికి కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు రాష్ట్రంలో బాగానే క‌ట్ట‌డిలో ఉన్న‌ట్లు క‌నిపించిన వైర‌స్ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల స‌డ‌లింపుల‌తో క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది.గ‌డిచిన ప‌ది రోజులుగా ప్ర‌తీ రోజూ 180 కేసుల‌కు పైగానే న‌మోద‌వుతూ వ‌స్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో అయితే ప‌రిస్థితి భ‌యంక‌రంగా తయారైంది. సామాన్య జ‌నంతో పాటు ఈ ప్రాంతంలోని అధికారులు, విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది, వైద్యులు, పోలీసులు, జ‌ర్న‌లిస్టులు, పారిశుధ్య సిబ్బంది, చిరు ఉద్యోగులు, ఆల‌యాల సిబ్బంది ఇలా ప్ర‌తీ రంగానికి చెందిన వారు క‌రోనా కాటుకు బ‌ల‌మ‌వుతున్నారు. 

 


రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ‌ల‌యంలో చివ‌రికి ప‌లువురు ఉన్న‌తాధికారులు కూడా చిక్కుకుంటున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌థ‌మ పౌరుడు..మేయ‌ర్ బొంతు రాంమోహ‌న్‌రావు ద‌గ్ద‌ర ప‌నిచేసే సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో మేయ‌ర్ కుటుంబ స‌భ్యులంతా కూడా ఇప్పుడు హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతున్నారు. అలాగే వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించనున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం యాదాద్రి సీఈవో దంపతులకూ కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న సీఈవో సెలవు పెట్టి హైదరాబాద్‌ వనస్థలిపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్ భార్య‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

 


 ఈ నేపథ్యంలో తాను వారం పాటు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని కలెక్టర్ ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నాడు. ఇలా భిన్న వ‌ర్గాల‌కు చెందిన  ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా ప‌ల్లెల్లో కూడా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో సామాన్య జ‌నం హ‌డ‌లెత్తిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనా పేషంట్ల‌కు ఇంటి వ‌ద్ద‌నే చికిత్స అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వస్తోంది. ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో ఏర్పాటు చేస్తున్న కంటోన్మెంట్ల విధానం ఏమాత్రం స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డం లేద‌ని, అధికారులు కూడా అమ‌లును గాలికి వ‌దిలేశార‌నే చెప్పాలి. ఇక భౌతిక దూరం పాటింపు విధానంపై ఇంకా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెర‌గాల‌న్న అభిప్రాయాన్ని వైద్యులు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: