అమెరికా చైనాల కోల్డ్‌వార్‌కు భార‌త్ బ‌ల‌వుతోంది. ‘కరోనా’ వ్యాప్తికి చైనానే ప్రధాన కారణంగా భావిస్తున్న అమెరికా, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేననే సంకేతాలిస్తోంది. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతున్న చైనా, తాను సైతం యుద్ధానికి సిద్ధమేననే రీతిలో సైనిక విన్యాసాలను ముమ్మరం చేస్తున్న విష‌యం తెలిసిందే. ‘కరోనా’ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై చైనాను ముద్దాయిగా నిలబెట్టేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. అమెరికాతో భార‌త్ చెలిమి చేయ‌డం ఇష్టం లేని చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద కొంత గంద‌ర‌గోళం సృష్టించేందుకు సైన్యాన్ని మోహ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భాగంగానే..వ్యూహాత్మ‌కంగా భార‌త‌ భూభాగాన్ని కబళించేందుకు  బలగాలను ముందుకు తీసుకువ‌స్తోంది.

 

 అలాగే  దక్షిణ చైనా సముద్రంలో జనావాసాలు లేని ఖాళీ దీవులను సైతం కబళించి, వాటిపై తన సార్వభౌమత్వాధికారాన్ని చాటుకునే దిశగా పావులు కదుపుతోంది. ‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి చైనా ప్రపంచ దేశాలను ఉద్దేశపూర్వకంగానే అప్రమత్తం చేయలేదని అమెరికా ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ రెండు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అమెరికా చైనాపై యుద్ధానికైనా సిద్ధ‌మే అన్న‌ట్లుగా మాట్లాడుతుండ‌గా....తాము కూడా సిద్ధ‌మే అన్న ధోర‌ణిలో చైనా వాయిస్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే చైనాపై యుద్ధం చేయాల్సి వ‌స్తే అమెరికాకు భార‌త్ సాయం ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది.

 

 అంతేకాక చైనాకు ధీటుగా భార‌త్‌ను ఆసియాలో సూప‌ర్ ప‌వ‌ర్‌గా నిల‌పాల‌ని చూస్తోంది. ఇది చైనాకు న‌చ్చ‌డం లేదన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్ప‌టికే అమెరికాకు చెందిన చైనాలో ఉన్న సంస్థ‌లు భార‌త్‌కు వ‌ల‌స వ‌స్తున్నాయి. ఈ సంస్థ‌ల నిర్ణ‌యం వెనుక ట్రంప్ ప్ర‌భుత్వం యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయ‌నే వాద‌న ఉంది. అయితే భార‌త్‌లోని రాయితీలే ఇందుకు కార‌ణ‌మ‌నే వారూ ఉన్నారు. ఈ రెండు నిజ‌మే కావ‌చ్చు. కానీ అంతిమంగా మాత్రం చైనాకు చేటే జ‌రుగుతోంది. ఇందులో భార‌త్ ప్ర‌మేయం లేక‌పోయిన‌ప్ప‌టికీ చైనా ఇండియాపై ఆగ్ర‌హంతో రగిలిపోతోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తమకు వ్యతిరేకంగా అమెరికాకు మ‌ద్ద‌తు తెల‌ప‌డంపై  చైనా ఇటీవల దూకుడు పెంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: