టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు టీడీపీ శ్రేణులు. అధినేత చంద్రబాబు నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు అందరూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. అదే రోజు సాయంత్రం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఇవాళ శనివారం ఉదయం 154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిలను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.

 

దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. పోలీసులు ఎప్పుడు ఎవరింటి తలుపు తడతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా అచ్చెన్న అరెస్టుపై స్పందించిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. అచ్చెన్నాయుడు నిజంగా తప్పుచేస్తే చర్యలు తీసుకోవాలని.. అంతేగానీ గోడ దూకి మరీ అరెస్టు చేయాల్సిన అవసరంలేదని అన్నారు. అలాగే టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టు అవుతారని మంత్రులు అనడం సరికాదని, మంత్రుల వ్యాఖ్యలతో నిజంగా వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రజలు అనుకుంటారని అది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని అన్నారు.

 

ఇదిలా ఉంటే అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని దీనిని నేను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలపై రఘురామకృష్ణంరాజు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అది కాస్త టీడీపీకి అస్త్రంగా మారే అవకాశం ఉంది.

 

అయితే రఘురామకృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాల్లో టాక్. అదేంటంటే.. ఎప్పటినుంచో రఘురామకృష్ణంరాజు బీజేపీలోకి వెళ్లేందుకు చూస్తున్నారని.. కాకపోతే తానంతట తానుగా వెళ్ళకుండా.. పార్టీచే బహిష్కరింపబడాలని చూస్తున్నారట. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా సొంత పార్టీ నేతలను గిల్లుతుంటారు అని తెలుస్తుంది. మరి ఈ ఎంపీ విషయంలో సీఎం జగన్ ఇకనైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: